New Labour law: కొత్త రూల్స్‌పై అభ్యంతరాలు ఉన్నాయా? కేంద్రానికి మీ సలహా ఇలా చెప్పండి!
భారతదేశ కార్మిక రంగంలో రాబోతున్న అతిపెద్ద మార్పులకు సమయం ఆసన్నమైంది. 2025 నవంబర్ నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్ (Labour law) కు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా డ్రాఫ్ట్ రూల్స్‌ను విడుదల చేసింది. అయితే ఇక్కడే మనకు ఒక గొప్ప అవకాశం దక్కింది. ఈ నియమాలు ఎలా ఉండాలి? వేతనాలు, పని గంటలు, సెలవుల విషయంలో సామాన్యులకు నష్టం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరుతోంది. అంటే మీరు కూడా మీ సలహాలను కేంద్రానికి పంపొచ్చు. ఇదెలా పంపాలో ఇప్పుడు చూద్దాం.

ప్రభుత్వం ఎందుకు ఫీడ్‌బ్యాక్ అడుగుతోంది?
ఏ చట్టమైనా క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే, అది ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. కొత్త లేబర్ (Labour law) లోని నిబంధనలు అంటే.. కనీస వేతనం లెక్కించే విధానం, 48 గంటల పని పరిమితి, మహిళా ఉద్యోగుల భద్రత వంటి అంశాలపై మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైన 30 నుండి 45 రోజుల లోపు మన సలహాలను పంపాల్సి ఉంటుంది.
మనం ఎలాంటి మార్పులు కోరవచ్చు?
మీరు ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు ఈ క్రింది కీలక అంశాలను ప్రస్తావించవచ్చు..
- గ్రాట్యుటీ నిబంధన: ప్రస్తుతం ఏడాదికే గ్రాట్యుటీని కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులకే కాకుండా, పర్మనెంట్ ఉద్యోగులకూ వర్తింపజేయాలని కోరవచ్చు.
- టేక్ హోమ్ శాలరీ: అలవెన్సుల మీద 50% క్యాప్ విధించడం వల్ల చేతికి వచ్చే జీతం తగ్గకుండా పన్ను మినహాయింపులు పెంచాలని సూచించవచ్చు.
- గిగ్ వర్కర్ల రక్షణ: స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ ఏజెంట్లకు కూడా కనీస వేతనం, బీమా సౌకర్యం కల్పించాలని గట్టిగా అడగవచ్చు.
- పని గంటలు: ఎనిమిది గంటల పని విధానాన్ని కఠినంగా అమలు చేసేలా పర్యవేక్షణ ఉండాలని కూడా ఫిర్యాదు చేయవచ్చు.
- మీ ఇష్టం: కేవలం ఇవి మాత్రమే కాదు, మీకు ఏవైనా ఇతర అభ్యంతరాలు ఉన్నా లేదా చట్టంలో ఇలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఉంటే మీరు ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ ఇవొచ్చు.
మీ సలహాను కేంద్రానికి ఎలా పంపాలి?
ప్రభుత్వం కోరిన విధంగా మీరు మీ అభ్యంతరాలు లేదా సూచనలను వ్రాతపూర్వకంగా పంపవచ్చు..
- ఈమెయిల్ లేదా పోస్ట్: కేంద్ర కార్మిక శాఖ వెబ్‌సైట్‌లో ఇచ్చిన నిర్దేశిత ఫార్మాట్‌లో మీ సలహాలను కార్యదర్శి, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు పంపాలి.
- స్పష్టత: మీ సలహా ఏ కోడ్‌కు (ఉదాహరణకు: వేతనాల కోడ్ లేదా సామాజిక భద్రతా కోడ్) సంబంధించిందో స్పష్టంగా పేర్కొనాలి.
మొత్తంగా మన లేబర్ లా (Labour law) అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పార్లమెంటులో అమలు చేసే చట్టాల కంటే, గ్రౌండ్ లెవల్‌లో ఇబ్బందులు పడే మనలాంటి వారు ఇచ్చే సలహాలకే ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి ఈ 45 రోజుల సమయాన్ని వృథా చేయకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా మీ వంతు కృషి చేయండి.


Click it and Unblock the Notifications