ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారంటే.. నేరం వాళ్లు చేసి.. ఆ నిందను మీ మీదకు నెట్టేస్తున్నారు. దీనికి వారు వాడుతున్న అస్త్రమే 'మ్యూల్ ఖాతాలు' (Mule Accounts). మీ బ్యాంకు ఖాతాను వాళ్లకు అప్పగించి మీరు చిక్కుల్లో పడకండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 8.5 లక్షల మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అసలు మీ అకౌంట్ హ్యాక్ (account hack) అవ్వకుండా ఉండాలంటే.. మీరు తెలియకుండానే నేరస్థులుగా మారకుండా ఉండాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.
మ్యూల్ ఖాతా అంటే..
సైబర్ నేరగాళ్లు తాము దోచుకున్న డబ్బును నేరుగా తమ అకౌంట్లలోకి వేసుకోరు. పోలీసులు దొరకబడతారనే భయంతో, సాధారణ ప్రజల బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటారు. కొంతమందికి నెలకు ఇంత అని కమీషన్ ఇచ్చి అకౌంట్లు తీసుకుంటారు. మీకు తెలియకుండానే మీ ఆధార్, పాన్ కార్డులతో అకౌంట్లు తెరిచే ప్రమాదం ఉంది. ఇలా ఒకరి పేరు మీద ఉన్న అకౌంట్‌ను నేరగాళ్లు వాడితే దానినే 'మ్యూల్ అకౌంట్' అంటారు.

ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ. 175 కోట్లు!
ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో జరిపిన విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి. ఒక బ్యాంకు శాఖలో ఆరు కరెంటు అకౌంట్ల ద్వారా కేవలం కొద్ది నెలల్లోనే రూ. 175 కోట్ల లావాదేవీలు జరిగాయి. తీరా పోలీసులు ఆరా తీస్తే.. ఆ ఖాతాదారులు ఇద్దరు సాధారణ ఆటో డ్రైవర్లు! కమీషన్ ఇస్తామంటే అకౌంట్ ఇచ్చామని వారు అమాయకంగా చెప్పారు. కానీ, చట్టం ముందు వారు కూడా నేరస్థులే. చివరికి ఆ బ్యాంకు మేనేజర్ కూడా ఇందులో చేతులు కలపడం గమనార్హం.
మీ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించడం ఎలా?
కొన్నిసార్లు మీ అకౌంట్ హ్యాక్ (account hack) కాకపోయినా.. మీ ప్రమేయం లేకుండానే మ్యూల్ ఖాతాగా మారిపోవచ్చు. ఇలా జరిగిందనడగానికి గుర్తులు ఏంటంటే..
- మీ ప్రమేయం లేకుండానే అకౌంట్లోకి డబ్బు రావడం, వెంటనే విత్‌డ్రా అవ్వడం.
- తెలియని వ్యక్తులు మీ యూపీఐ (PhonePe, GPay) వివరాలు అడగడం.
- బ్యాంకు నుంచి అనుమానాస్పద లావాదేవీల మెసేజ్లు రావడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సైబర్ మాయగాళ్ల బారి నుండి తప్పించుకోవడానికి మీరు ఏం చేయాలంటే..
- ఖాతా వివరాలు ఎవరికీ ఇవ్వద్దు: స్నేహితులైనా, తెలిసిన వారైనా.. డబ్బులు జమ చేసి తీస్తామంటే నమ్మకండి.
- క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయండి: కనీసం ఆరు నెలలకోసారి మీ క్రెడిట్ రిపోర్ట్ చూసుకుంటే.. మీ పేరు మీద ఎక్కడైనా లోన్లు లేదా అకౌంట్లు ఉన్నాయో తెలుస్తుంది.
- సంచార్ సాథీ పోర్టల్: ఈ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చూసుకోండి.
- బ్యాంకుకు సమాచారం: మీ ఖాతాలో తెలియని సొమ్ము పడితే వెంటనే బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేయండి. లేదంటే మీ అకౌంట్‌ను పోలీసులు ఫ్రీజ్ చేస్తారు.
గుర్తుంచుకోండి, ఒకప్పుడు మ్యూల్ అకౌంట్ ఇచ్చిన వారిని పోలీసులు వదిలేసేవారు. కానీ, ఇప్పుడు వారినీ అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేసి మీ బ్యాంకు వివరాలు పంచుకోకండి.


Click it and Unblock the Notifications