2000 Notes: క్లీన్ నోట్ పాలసీ కింద సెంట్రల్ బ్యాంక్ దేశంలో పెద్ద నోటు రూ.2000లను వెనక్కి తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీని గడువు వాస్తవంగా గత నెలలో ముగిసింది. కానీ దీనిని అక్టోబర్ 7 వరకు రిజర్వు బ్యాంక్ పొడిగించింది.
ఈ క్రమంలో రేపటితో(అక్టోబర్ 7,2023) నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఉన్న గడువు పూర్తిగా ముగియనుంది. గణాంకాల ప్రకారం మే 19, 2023 వరకు చెలామణిలో రూ.3.56 లక్షల కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకా రూ.12,000 కోట్లు విలువైన నోట్లు ఇప్పటికీ తిరిగి రాలేదని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంటే ఈ సొమ్ము ఇంకా ప్రజల వద్దే ఉందని ఆర్థం. అయితే వీటిని గడువు తర్వాత మార్చుకోవచ్చా..? లేదా..? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

ఈ క్రమంలో నోట్లను మార్చుకోని వారికి సెంట్రల్ బ్యాంక్ వెసులుబాటును ప్రకటించింది. అక్టోబర్ 7, 2023 తర్వాత నోట్లు కలిగి ఉన్న వారు దేశంలోని 19 RBI కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. దీనికోసం ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో నోట్లను డిపాజిట్ చేయడానికి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో దేనికైనా ఇండియా పోస్ట్ ద్వారా రూ.2,000 నోట్లను పంపవచ్చు. అలాగే దేశంలోని వివిధ సంస్థలు సైతం రిజర్వు బ్యాంక్ కార్యాలయాల ద్వారా తమకు వచ్చే 2000 నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది.
నోట్ల రద్దు సమయంలో ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లలో 87 శాతం సర్క్యులేషన్ నుంచి ఇప్పటికే వెనక్కి వచ్చాయని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే వీటిని వెనక్కి తీసుకున్నప్పటికీ లిక్విడిటీకి ఇబ్బంది కలుగకుండా నోట్లను అందుబాటులో ఉంచినట్లు గతంలోనే వెల్లడించారు. గత శనివారం వరకు డేటాను పరిశీలిస్తే రూ.14,000 కోట్లు విలువైన నోట్లు తిరిగి రావాల్సి ఉందని అప్పట్లో వెల్లడైంది.


Click it and Unblock the Notifications