Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో, ఇన్వెస్టర్లందరి చూపు మళ్ళీ బంగారం (Gold) వైపు మళ్లుతోంది. సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా (Safe Haven) మాత్రమే చూస్తాం. కానీ, 'బిసిఏ రీసెర్చ్' (BCA Research) తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, బంగారం కేవలం రక్షణ మాత్రమే కాదు, అద్భుతమైన లిక్విడిటీ (Liquidity) , డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

లిక్విడిటీ అంటే ఏమిటి? బంగారంలో అది ఎలా ఉంటుంది?
సాధారణ భాషలో చెప్పాలంటే, ఏదైనా ఒక ఆస్తిని ఎంత వేగంగా నగదుగా మార్చుకోగలము అనేదే లిక్విడిటీ. బంగారం మార్కెట్ చాలా లోతైనది. అంటే, పెద్ద మొత్తంలో బంగారాన్ని విక్రయించినా లేదా కొనుగోలు చేసినా మార్కెట్ ధరలో పెద్దగా మార్పు రాదు. ప్రధాన కరెన్సీ జంటలతో సమానమైన లిక్విడిటీని బంగారం కలిగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో లేదా మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పుడు, మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేయడానికి బంగారం అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సాధనంగా పనిచేస్తుంది.
ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే లాభం?
చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే.. ఫిజికల్ గోల్డ్ కొనాలా? గోల్డ్ ఈటీఎఫ్ (ETF)లలో పెట్టాలా? లేదా గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్లు కొనాలా? అని.
- గోల్డ్ మైనింగ్ షేర్లు: ఇవి బంగారం ధర పెరిగినప్పుడు ఎక్కువ లాభాలను ఇస్తాయి కానీ, కంపెనీల బ్యాలెన్స్ షీట్లు , ఈక్విటీ మార్కెట్ రిస్క్ వంటి ఇతర ఇబ్బందులు ఉంటాయి.
- బలియన్ లేదా ఈటీఎఫ్‌లు: స్వచ్ఛమైన హెడ్జింగ్ కోసం బులియన్-బ్యాక్డ్ ఈటీఎఫ్‌లు లేదా డైరెక్ట్ స్పాట్ పొజిషన్లు అత్యంత ప్రభావవంతమైనవని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి వడ్డీ లేకపోయినా, మార్కెట్ నష్టాల నుంచి మీ పెట్టుబడిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్
సాధారణంగా స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు చాలా ఆస్తుల విలువ తగ్గిపోతుంది. కానీ, బంగారం చరిత్రను గమనిస్తే.. ఈక్విటీలు , ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ అసెట్స్ తో బంగారం తక్కువ లేదా నెగటివ్ కోరిలేషన్ కలిగి ఉంటుంది. అంటే షేర్ల ధరలు పడిపోయినప్పుడు బంగారం ధర స్థిరంగా ఉండటం లేదా పెరగడం జరుగుతుంది. దీనివల్ల మీ మొత్తం పోర్ట్‌ఫోలియో నష్టాల తీవ్రత తగ్గుతుంది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బంగారం అనేది కేవలం డిఫెన్సివ్ ఆప్షన్ మాత్రమే కాదు, అది రిస్క్-అడ్జస్టెడ్ గ్రోత్ స్ట్రాటజీలో ఒక ప్రాథమిక భాగం. సాంప్రదాయ పెట్టుబడులు విఫలమైనప్పుడు గోల్డ్ మాత్రమే ఇన్వెస్టర్లకు అండగా నిలుస్తుంది.
మొత్తంగా చూస్తే.. నేటి అనిశ్చిత కాలంలో 'బంగారంలో పెట్టుబడి పెట్టాలా వద్దా?' అనే చర్చ నుంచి 'ఏ రూపంలో , ఎంత మేర పెట్టుబడి పెట్టాలి?' అనే స్థాయికి మార్కెట్ చేరుకుంది. అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ, బంగారం ఇచ్చే రాబడులు , దానికున్న లిక్విడిటీ అడ్వాంటేజ్ ఇన్వెస్టర్లకు ఇతర అసెట్స్ కంటే ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలనుకుంటే, మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బంగారానికి కేటాయించడం మంచి వ్యూహం.


Click it and Unblock the Notifications