పక్కింటికి వెళ్లినంత ఈజీగా పక్క రాష్ట్రానికి.. దక్షిణాది నగరాలన్నీ కలుపుతూ బుల్లెట్ ట్రైన్!
భారతీయ రైల్వే ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన ప్లాన్ సిద్ధం చేసింది. దీనినే 'హై-స్పీడ్ డైమండ్ కారిడార్' (High-Speed Diamond Corridor) అని పిలుస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అద్భుతమైన ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad), అమరావతి (Amaravati), చెన్నై (Chennai) వంటి నగరాల మధ్య దూరం గణనీయంగా తగ్గిపోనుంది.

ప్రయాణ సమయాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ హై-స్పీడ్ నెట్‌వర్క్ వల్ల ఏ నగరాల మధ్య ఎంత టైమ్ ఆదా అవుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం..
- అమరావతి నుండి హైదరాబాద్: కేవలం 70 నిమిషాలు.
- హైదరాబాద్ నుండి బెంగళూరు: సుమారు 2 గంటల 8 నిమిషాలు.
- చెన్నై నుండి బెంగళూరు: కేవలం 73 నిమిషాలు.
- హైదరాబాద్ నుండి పూణే: 1 గంట 55 నిమిషాలు.
- పూణే నుండి ముంబై: కేవలం 48 నిమిషాలు.
ప్రస్తుతం ఈ నగరాల మధ్య రైలు ప్రయాణానికి పట్టే సమయంతో పోలిస్తే, ఇది విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, వ్యాపార , ఆర్థిక సంబంధాలు కూడా బలపడతాయి.
దక్షిణ భారత్ పై రైల్వే వరాలు
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఏపీకి గతంలో ఉన్న రూ. 886 కోట్ల కేటాయింపుల నుండి ఇప్పుడు ఏకంగా రూ. 10,134 కోట్లకు పెంచడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓడరేవులు, పర్యాటక ప్రాంతాలు , ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఈ పనులు సాగుతున్నాయి.
వందే భారత్ , స్టేషన్ల అభివృద్ధి
ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే 16 వందే భారత్ రైళ్లు, 22 అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, సుమారు 74 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్నారు. ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే కారిడార్‌ను ఫోర్-లైన్ (నాలుగు లైన్లు) నెట్‌వర్క్‌గా మారుస్తున్నారు. దీనివల్ల రైల్వే కెపాసిటీ డబుల్ అవుతుంది , సుమారు 500 కొత్త రైళ్లను నడిపే అవకాశం ఏర్పడుతుంది.
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్
ఈ డైమండ్ కారిడార్ కేవలం ప్రయాణానికే కాదు, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఒక ఇంజిన్‌లా పనిచేస్తుందని అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాస్ట్ కనెక్టివిటీ వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి , కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తాయి. విమాన ప్రయాణంతో పోటీ పడేలా రైల్వేను ఆధునీకరిస్తున్న ఈ ప్లాన్ అమల్లోకి వస్తే, దక్షిణ భారతదేశం ఒక మెగా ఎకనామిక్ హబ్‌గా మారడం ఖాయం. భవిష్యత్తులో బెంగళూరు నుండి హైదరాబాద్ లేదా చెన్నైకి వెళ్లడం అంటే పక్కింటికి వెళ్ళినంత ఈజీ అయిపోతుందన్నమాట!


Click it and Unblock the Notifications