Billionaires networth: దేశంలోని కొందరు దిగ్గజ వ్యాపారులకు 2023 తీపి జ్ఞాపకాలను మిగల్చగా.. మరికొందరిని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టింది. ఏడాది మొత్తంగా చూస్తే బిలియనీర్ల సంపద భారీగా పెరిగింది. బలమైన దేశీయ వృద్ధి అంచనాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
సంపాదన పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఈ ఏడాది టాప్ ప్లేస్ లో నిలిచారు. 2023లో ఆయన నెట్ వర్త్ దాదాపు 83 వేల 248 కోట్లకు పైగా పెరిగింది. దీంతో ఆయన ఆస్తి విలువ మొత్తం 97.1 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ 13వ స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం HCLTech వ్యవస్థాపకులు శివ్ నాడార్ రెండవ స్థానంలో నిలిచారు. అంతర్జాతీయంగా IT రంగంలో మందగమనం ఏర్పడినప్పుటికీ కంపెనీ షేర్ల విలువ దాదాపు 40 శాతానికి పైగా పెరిగాయి. తద్వారా ఆయన సంపద కాస్తా 78 వేల కోట్లు పెరిగి 34 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇక జిందాల్ గ్రూప్ మాజీ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ ఈ ఏడాది అత్యంత సంపన్న భారతీయ మహిళగా నిలిచారు. 8.93 బిలియన్ డాలర్ల సంపాదనలో మూడో స్థానం కైవసం చేసుకున్నారు. ఆమె మొత్తం సంపద విలువ 24.7 బిలియన్ డాలర్లు. వీరేకాక DLF చైర్మన్ కుశాల్ సింగ్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత షాపూర్ మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ కుమార్ మంగళం బిర్లా, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి, ఎయిర్ టెల్ కు చెందిన సునీల్ మిట్టల్ ఈ ఏడాది భారీగా లబ్ధి పొందారు.
దేశంలో రెండవ అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీకి 2023 ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. మొత్తం మీద 37.3 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోవాల్సి వచ్చింది. తద్వారా నికర ఆస్తి విలువ 83.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రిటైల్ చైన్ డి-మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ కూడా 1857 మిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు.


Click it and Unblock the Notifications