Budget 2026: బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? తెర వెనుక ఆసక్తికర విషయాలు!
భారతదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది. ఎందుకంటే ఆ రోజున కేంద్ర బడ్జెట్ విడుదల చేస్తారు. బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నారంటే ప్రతీ ఒక్కరూ ఏమేం ధరలుపెరుగుతాయి? ఏవి తగ్గుతాయి? అన్న ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తుంటారు. మరికొన్ని రోజుల్లో 2026 బడ్జెట్(Budget 2026) విడుదల కాబోతోంది. అయితే అసలు ఈ భారీ బడ్జెట్ డాక్యుమెంట్ వెనుక ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా? ఆరు నెలల ముందు నుంచే మొదలయ్యే ఈ ప్రక్రియలో చాలా రహస్యాలు దాగి ఉంటాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆరు నెలల ముందే మొదలయ్యే వేట
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి దాదాపు ఆరు నెలల ముందే.. అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోనే దీని కసరత్తు మొదలవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (Department of Economic Affairs) అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, ఇతర ప్రభుత్వ శాఖలకు 'బడ్జెట్ సర్కులర్' పంపుతుంది. వచ్చే ఏడాదికి మీకు ఎంత నిధులు కావాలి? మీ ఆదాయం ఎంత? అనే వివరాలను సేకరిస్తుంది.
సమీక్షలు.. సంప్రదింపులు..
డేటా మొత్తం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ (NITI Aayog) ప్రతినిధులు, ఇతర ఆర్థిక నిపుణులతో కలిసి మేధోమథనం చేస్తారు. ఏ రంగానికి ఎంత కేటాయించాలి? పన్నులు పెంచాలా లేదా తగ్గించాలా? అనే అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతాయి. చివరగా ఈ ముసాయిదాను ప్రధాన మంత్రితోపాటు కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తుంది.
హల్వా సెర్మనీ.. 'లాక్-ఇన్' పీరియడ్
బడ్జెట్ తయారీలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం 'హల్వా సెర్మనీ'. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సుమారు 10 రోజుల ముందు ఆర్థిక మంత్రి సమక్షంలో హల్వా వండి అధికారులందరికీ పంచుతారు. ఈ కార్యక్రమం ముగియగానే బడ్జెట్ ప్రింటింగ్ ప్రక్రియలో పాల్గొనే సుమారు 100 మంది అధికారులు నార్త్ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లో బందీలుగా ఉండాలి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఫోన్లు కూడా అనుమతించరు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు వారు అక్కడే ఉండాలి.
రహస్య 'బ్లూ షీట్' (Blue Sheet)
బడ్జెట్ తయారీలో అత్యంత గోప్యమైన పత్రం 'బ్లూ షీట్'. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు, అంచనాలు ఉంటాయి. ఈ షీట్ పర్యవేక్షణ కేవలం అత్యున్నత స్థాయి అధికారుల వద్దే ఉంటుంది. బడ్జెట్ లీక్ కాకుండా ఉండేందుకు ఇది చాలా కీలకం.
బడ్జెట్ దేశ భవిష్యత్తుకు పునాది
భారతదేశం 2017 నుండి ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టే ఆచారాన్ని పాటిస్తోంది. దీనివల్ల ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే నాటికే నిధుల కేటాయింపులు పూర్తవుతాయి. ఈసారి బడ్జెట్ (Budget 2026) పై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిజిటల్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ తయారీ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తారని నిపుణులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ సుదీర్ఘమైన, క్లిష్టమైన ప్రక్రియ ద్వారా తయారయ్యే బడ్జెట్.. ఈ సారి దేశాన్ని ఆర్థికంగా ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే!


Click it and Unblock the Notifications