అమ్మాయి గొంతుతో ఒక్క వాట్సప్ మెజేస్.. రూ. 21 కోట్లు పోగొట్టుకున్న చార్టర్డ్ అకౌంటెంట్..
హలో... నేను దివ్య మాట్లాడుతున్నాను అంటూ వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క పరిచయ సందేశం... దాదాపు రూ. 21 కోట్లు నష్టపోయేలా చేసింది. అది సాదా సీదా వ్యక్తి కూడా కాదు.. చార్టడ్ అకౌంటెంట్ ఖాతా నుంచి ఈ డబ్బులు మాయమైన ఘటన గ్వాలియర్ లో చోటు చేసుకుంది. అమ్మాయిలా పరిచయం పెంచుకుని ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయలను కేటుగాళ్లు పిండుకున్నారు. ఇక ఈ కథలోకి వెళ్తే.. గ్వాలియర్‌కు చెందిన 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ అశోక్ విజయవర్గియాను ఒక్క వాట్సాప్ మెసేజ్ ఏకంగా రూ. 21.06 కోట్ల భారీ సైబర్ మోసంలోకి ముంచేసింది.
డిసెంబర్ 2025 నుండి జూలై 2026 మధ్యకాలంలో జరిగిన ఈ నకిలీ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. దేశంలోనే అత్యంత పెద్ద సైబర్ మోసాలలో ఒకటిగా నిలిచింది. యూఎస్‌డీటీ (USDT-టెథర్) క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పేరుతో బాధితుడిని నమ్మించి, ఒక నకిలీ వెబ్‌సైట్ ద్వారా ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. డిసెంబర్ 25, 2025న విజయవర్గియా ప్రయోగాత్మకంగా యూపీఐ (UPI) ద్వారా నాలుగు సార్లు రూ. 10 వేల చొప్పున బదిలీ చేయగా.. ఆ తర్వాత ఒక స్నేహితుడి యూపీఐ ద్వారా మరో రూ. 1 లక్ష పంపించారు.

జనవరి 7న ఆయన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాలో తొలి రాబడిగా రూ. 1.88 లక్షలు జమ కావడంతో.. ఆ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఆయనకు పూర్తి నమ్మకం ఏర్పడింది. దీనికంటే ముందే డిసెంబర్ 31 నాటికి తన యూనియన్ బ్యాంక్ ఖాతా నుండి ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా రూ. 15 లక్షలు బదిలీ చేసిన ఆయన.. ఆ తర్వాతి నెలల్లో మోసగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు కోట్ల రూపాయలను గుడ్డిగా బదిలీ చేస్తూ పోయారు.
బాధితుడు డబ్బు జమ చేస్తున్న కొద్దీ.. సదరు నకిలీ ట్రేడింగ్ పోర్టల్ ఆయన పెట్టుబడి వేగంగా పెరుగుతున్నట్లు తప్పుడు గ్రాఫ్‌లను చూపిస్తూ చివరికి రూ. 33.25 కోట్ల బ్యాలెన్స్‌ను ప్రదర్శించింది. అయితే, విజయవర్గియా ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మోసగాళ్లు అసలు రంగు బయటపెట్టారు. అంత భారీ సొమ్మును విత్ డ్రా చేయాలంటే ముందుగా రూ. 10.84 కోట్ల ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత విత్‌డ్రా మొత్తం ఎక్కువగా ఉన్నందున రిస్క్ మార్జిన్ కింద మరో రూ. 1 కోటి కట్టాలంటూ కొత్త వంకలతో మరికొంత డబ్బు లాగారు.
ఈ వ్యవహారమంతా మోసమని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ మరియు 1930 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గ్వాలియర్ రాష్ట్ర సైబర్ సెల్ డీఎస్పీ సంజీవ్ నయన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిధులను దేశవ్యాప్తంగా వేలాది నకిలీ ఖాతాల ద్వారా నాలుగు అంచెల (Four-Layer) నిర్మాణంలో బదిలీ చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం నేరుగా డబ్బు స్వీకరించిన 77 ఫస్ట్-లేయర్ బ్యాంకు ఖాతాలను నిశితంగా పరిశీలిస్తోంది. బాధితుడు సకాలంలో ఫిర్యాదు చేయడంతో.. ఆయా ఖాతాల్లో ఉన్న రూ. 2 కోట్ల మొత్తాన్ని పోలీసులు విజయవంతంగా స్తంభింపజేయగలిగారు.
ప్రస్తుతం గుర్తుతెలియని నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BJS) సెక్షన్లు 318(4), 319(2), ఐటీ చట్టంలోని సెక్షన్ 66D కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి, మోసపూరిత URLలు, వాట్సాప్ నంబర్ల ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేస్తున్నారు. మిగిలిన సొమ్మును రికవరీ చేయడానికి.. ఈ దేశవ్యాప్త క్రిప్టో మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దర్యాప్తు అధికారులు ముమ్మరంగా శోధిస్తున్నారు.


Click it and Unblock the Notifications
