సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూలస్తంభాలు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటిమంది మహిళలను వచ్చే 5 ఏళ్లలో కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు రూ.21వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామన్నారు.
పాఠశాలల నిర్వహణ మహిళలకే అప్పగించామని తెలిపారు. రుణాలిచ్చి బస్సులు కొనుగోలు చేయించామని... మహిళా సంఘాల బస్సులను ఆర్టీసీకి అద్దెకు తీసుకుని వాళ్లకి ఆదాయం కల్పిస్తున్నామన్నారు. అలాగే క్యూఆర్ కోడ్ కార్డు ఇచ్చి మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

అలాగే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే రైతులకు రూ.2లక్షలలోపు రుణాలను మాఫీ చేశామని చెప్పుకొచ్చారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.26వేల కోట్లు జమ చేశామన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. రైతుల భూములపై వివాదాలు లేకుండా ఉండేందుకు భూభారతి తీసుకొస్తున్నామని ప్రకటించారు.
ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని పొందగలిగామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జిఎస్)లో ఇప్పటికే 63 లక్షల మంది మహిళలు నమోదు చేసుకున్నారని, త్వరలోనే ఈ సంఖ్యను కోటి మందికి పెంచుతామని సీఎం తెలిపారు. కోటి మంది మహిళా సభ్యులందరినీ లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామన్నారు. కోటి మంది మహిళలు లక్షాధికారులుగా మారి తమ పిల్లలను వైద్యులు, న్యాయవాదులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా చేసినప్పుడే తెలంగాణ స్వర్ణ, ధనిక తెలంగాణ అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రభుత్వం శిల్పారామం సమీపంలో 100 దుకాణాలను నిర్మిస్తుందని సీఎం ప్రకటించారు.
దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటన ద్వారా ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్.సీ.ఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications