Hyderabad: దేశంలోని మెట్రో నగరాల్లో ప్రాపర్టీల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రతికూలతలు ఉన్నప్పటికీ అమ్మకాలు సైతం అదేవిధంగా రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి.
అనరాక్ రీసెర్చ్ తాజా వివరాల ప్రకారం పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో పాటు నివాస గృహాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశంలోని ఏడు పెద్ద నగరాల్లో ప్రాపర్టీల ధరలు గత ఏడాది ఇదే సమయం కంటే 6-10 శాతం మేర పెరిగాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో అత్యధికంగా 10% వార్షిక ధరల పెరుగుదల నమోదైంది. ఈ క్రమంలో నివాస ప్రాపర్టీ సగటు ధర చదరపు అడుగులకు రూ.4,980గా ఉందని వెల్లడైంది.

ఇదే క్రమంలో తెలంగాణ ఐటీ, ఫార్మా, ఇండస్ట్రియల్ హబ్‌గా మారటంతో రాజధాని హైదరాబాద్ రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్ల విక్రయాల్లో ఏకంగా 21% వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది రెండవ క్వార్టర్లో 13,570 యూనిట్ల విక్రయాలు జరగగా.. గత ఏడాది ఇదే సమయంలో 11,190 ప్రాపర్టీలు అమ్ముడయ్యాయి. దేశంలో ఒకపక్క హౌసింగ్ లోన్స్ రేట్లు గణనీయంగా పెరిగినప్పటికీ.. కొత్త యూనిట్ల నిర్మాణాలు, కొనుగోళ్లు ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతీయ హౌసింగ్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగింది.

2023 రెండవ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఏడు మెట్రో నగరాల్లో మెుత్తం గృహ అమ్మకాలు 1,15,100 యూనిట్లుగా ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), పూణేలు మొత్తం అమ్మకాల్లో 51 శాతాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పూణే అత్యధికంగా 65% వార్షిక వృద్ధిని సాధించింది. దీంతో ఈ రెండు పెద్ద నగరాల్లో మొత్తం 58,770 యూనిట్లు అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications