Hyderabad realty: విశ్వ నగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. అయితే ఈ ప్రాంతంలో నివాస ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ మే నెలలో భారీగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనుండగా.. ప్రస్తుతం మార్కెట్ స్తబ్ధుగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ మే నెలలో 7 శాతం తగ్గి 5 వేల 877 యూనిట్లకు పడిపోయినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదించింది. ఈ ప్రాంతంలోని నివాస మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి మరియు సంగారెడ్డి నాలుగు జిల్లాలను కలిపి తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఏప్రిల్ 2023లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే గత నెలలో 31 శాతం పెరిగాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ఇది 7 శాతం తక్కువ. కాగా నమోదైన ఆస్తుల మొత్తం విలువ 2 వేల 994 కోట్లుగా ఉంది. జిల్లా వారీగా మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 45 శాతం గృహ విక్రయాలు నమోదు కాగా.. రంగారెడ్డిలో 39 శాతం రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. మే 2023లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా 16 శాతంగా నమోదైంది.
గత నెలలో హైదరాబాద్ రీజియన్‌లో 25-50 లక్షల ధరల శ్రేణిలో అత్యధికంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌లు జరిగాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో వీటి వాటా 55 శాతం ఉందని చెప్పింది. 25 లక్షల కంటే తక్కువ ఆస్తుల రిజిస్ట్రేషన్లు 17 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇక కోటి మరియు అంతకంటే ఎక్కువ ఆస్తుల రిజిస్ట్రేషన్ల వాటా గత ఏడాది మే తో పోలిస్తే 3 శాతం పెరిగిందని పేర్కొంది.
"హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగులలోపు గృహాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. వడ్డీ రేట్ల పెంపును RBI పాజ్ చేయడం వల్ల ఎక్కువ స్థలం మరియు సౌకర్యాలు ఉన్న అధిక విలువ గల గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు" అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications