కర్ణాటక ప్రభుత్వం పట్టణాల్లో పనిచేస్తున్న లక్షలాది గృహ కార్మికులకు ఒక పెద్ద భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇప్పటివరకు వేతనాలు ఎలా ఇస్తున్నారు, ఎవరిని ఎలా నియమిస్తున్నారు అన్నది పూర్తిగా అయోమయంగా ఉండేది. చాలా మంది పనిమనిషులు, వంట మనుషులు, డ్రైవర్లు, నానీలు వంటివారు కనీస వేతనం కూడా లేకుండా, ఎలాంటి భద్రత లేకుండా పనిచేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చి వారికి కనీస రక్షణ ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం గృహ కార్మికుల (సామాజిక భద్రత మరియు సంక్షేమం) బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది
ఈ బిల్లు ప్రకారం.. ప్రతి గృహ కార్మికుడు, అతన్ని నియమించే యజమాని, అలాగే ప్లేస్‌మెంట్ ఏజెన్సీలు లేదా యాప్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద నమోదు కావాలి. నియామకం జరిగిన 30 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఒకసారి నమోదు చేసుకున్నాక కార్మికుడికి ప్రత్యేక ID ఇస్తారు. ఆ ID ఆధారంగా వారికి కనీస వేతనాలు, వారపు సెలవులు, ప్రసూతి ప్రయోజనాలు, వైద్య సాయం వంటి హక్కులు వస్తాయి. ఇక నుంచి రాతపూర్వక ఒప్పందం లేకుండా ఎవరినీ పనిలో పెట్టుకోవడానికి అనుమతి ఉండదు. ఆ ఒప్పందంలో పని స్వభావం, గంటలు, వేతనం, అదనపు ప్రయోజనాలన్నీ స్పష్టంగా ఉండాలి.

మరికొక ముఖ్యమైన అంశం ఏంటంటే సంక్షేమ రుసుము. యజమానులు లేదా ఏజెన్సీలు గృహ కార్మికుడి వేతనంలో గరిష్టంగా 5 శాతం వరకు ఒక ప్రత్యేక నిధికి జమ చేయాలి. ఈ రుసుము డిజిటల్ లావాదేవీ ద్వారా నేరుగా నిధిలో జమ అవుతుంది. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి వేతన గణన షీట్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ఎవరు చెల్లించకపోతే లేదా తప్పుగా చూపిస్తే వారికి జరిమానా పడుతుంది. ఈ డబ్బును నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా Karnataka
గృహ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తోంది. ఇందులో ప్రభుత్వం, కార్మిక సంఘాలు, యజమానులు, సేవా ప్రదాతలు, నివాసి సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఉంటారు. ఈ బోర్డు సంక్షేమ పథకాలు రూపొందించడం, తనిఖీలు చేయడం, ఫిర్యాదులు పరిష్కరించడం లాంటివి చూసుకుంటుంది.
ఈ బిల్లుతో గృహ కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. పనిలో గాయపడితే పరిహారం, వైద్య ఖర్చుల భరోసా, పింఛను, పిల్లల విద్య కోసం సాయం, అంత్యక్రియల ఖర్చులు కూడా ఈ నిధి నుంచి వస్తాయి. అదనంగా, వారిని బలవంతపు శ్రమ, వివక్షత, దోపిడీ, దుర్వినియోగం నుంచి రక్షించే నిబంధనలూ ఉన్నాయి.
కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ.. గృహ కార్మికుల సంఖ్య నగరాల్లో వేగంగా పెరుగుతోంది. కానీ వీరికి కనీస రక్షణ లేదు. చాలా మంది తక్కువ జీతం తీసుకుంటున్నారు, సమస్యలు ఉన్నా చెప్పడానికి భయపడుతున్నారు. ఈ బిల్లుతో ఆ లోటు భర్తీ అవుతుందని తెలిపారు. అదనపు కార్మిక కమిషనర్ జి. మంజునాథ్ కూడా ఈ చట్టం అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచనలకు అనుగుణంగా ఉందని, ముఖ్యంగా మహిళలకు ఇది పెద్ద భరోసా అవుతుందని తెలిపారు.సామాజిక కార్యకర్త రూత్ మనోరమ మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ఈ బిల్లు రావడం గమనార్హం. కానీ ఇందులో రిజిస్ట్రేషన్ విధానం, కాంట్రిబ్యూషన్ శాతం లాంటి అంశాలపై ఇంకా కార్మికులతో చర్చ అవసరం ఉంది" అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications