కరోనా వైరస్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హౌస్ హోల్డ్స్ ఫైనాన్షియల్ సేవింగ్స్ జీడీపీలో 8.2 శాతానికి పడిపోయినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబాల పొదుపు తగ్గడం వరుసగా రెండోసారి. అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇంతకంటే ఎక్కువగా క్షీణించింది. అలాగే ఇదే డిసెంబర్ త్రైమాసికంలో కుటుంబాల డిపాజిట్స్ జీడీపీలో 3 శాతానికి తగ్గాయి. అంతకుముందు త్రైమాసికంలో ఇది 7.7 శాతంగా నమోదయింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల నుండి కరోనా సమయంలో రుణాలు గణనీయంగా పెరిగినప్పటికీ, కుటుంబాల ఫైనాన్షియల్ లయబిలిటీస్ కాస్త తగ్గాయి.

ఆ తర్వాత రెండు త్రైమాసికాల్లో డౌన్
కరోనా నేపథ్యంలో ఆ ప్రభావం కుటుంబాల పొదుపుపై తీవ్రంగా పడింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీలో 8.2 శాతంగా ఉండగా, 2019-20 ఇదే త్రైమాసికంలో సేవింగ్స్ 10.4 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ డేటా వెల్లడిస్తోంది. గత ఏడాది దాదాపు మూడు నెలల లాక్ డౌన్ అనంతరం 2020-21 జూన్ త్రైమాసికంలో హౌస్ హోల్డ్స్ సేవింగ్స్ పుంజుకున్నప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్‌లలో తగ్గింది.

కుటుంబ రుణాలు తగ్గాయి
జీడీపీలో బ్యాంక్ డిపాజిట్ల నిష్పత్తి జులై-సెప్టెంబర్ కాలంలో 7.7 శాతంగా ఉండగా, అక్టోబర్-డిసెంబర్ కాలంలో 3 శాతానికి క్షీణించింది. జీడీపీలో రుణాల శాతం 2019 మార్చి నుండి స్థిరంగా పెరుగుతోందని ఆర్బీఐ వెల్లడించింది. 2020 సెప్టెంబర్ 37.1 శాతంగా ఉన్న రుణ నిష్పత్తి, 2020 డిసెంబర్ నాటికి 37.9 శాతానికి పెరిగింది. బ్యాంకులు, గృహరుణ సంస్థల రుణాలు పెరిగాయని, కానీ కుటుంబాలకు ఇచ్చిన రుణాలు మాత్రం తగ్గాయని తెలిపింది.

ఆర్థిక రుణాల్లో తగ్గుదల
డిపాజిట్స్, జీవిత బీమా ఫండ్స్, పెన్షన్ నిధులు, కరెన్సీ, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, చిన్న మొత్తాల పొదుపు సహా ఆర్థిక ఆస్తులు 2020 డిసెంబర్ చివరి నాటికి రూ.6.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌లో ఇవి రూ.7.46 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో ఆర్థిక రుణాలు రూ.2.54 లక్షల కోట్ల నుండి రూ.2.48 లక్షల కోట్లకు తగ్గాయి.


Click it and Unblock the Notifications