Viral Post: లింక్డ్ ఇన్‌లో ట్రెండవుతున్న 'వాహ్ తాజ్'.. దటీజ్ రతన్ టాటా అంటూ..
Tata News: ఎవరూ ఊరకనే గొప్పవారు కాదు. ఓ వ్యక్తి గుణగణాలు, అలవాట్లు మరియు పద్ధతులు వారిని ఆ స్థాయిలో నిలబెడతాయి. అలాంటి వ్యక్తుల్లో దేశం గర్వించదగ్గ రతన్ టాటా ముందు వరుసలో ఉంటారు. జంతువులపై ఆయనకున్న ప్రేమ గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అందులోనూ తన పెంపుడు కుక్కకు ఎంత విలువ ఇస్తారో అందిరికీ తెలిసిందే. కాగా ఆయన హోటల్ సిబ్బంది ప్రవర్తన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవల ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో రూబీ ఖాన్ అనే HR ప్రొఫెషనల్ బస చేశారు. ఆమెకు అక్కడ ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హోటల్ ఎెంట్రన్స్ వద్ద ప్రశాంతంగా నిద్రపోతున్న కుక్కను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. దాని గురించి ఆమె హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారిచ్చిన సమాధానం విని షాక్ అయినట్లు వెల్లడించారు.

లింక్డ్ ఇన్ పోస్ట్ ప్రకారం.. పుట్టినప్పటి నుంచి ఆ కుక్క హోటల్‌లో భాగంగా ఇక్కడే ఉంటున్నట్లు అక్కడి సిబ్బంది ఆమెకు తెలియజేశారు. హోటల్ ఆవరణలోకి ప్రవేశించే జంతువులను బాగా చూసుకోవాలని రతన్ టాటా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన కఠినంగా వ్యహరిస్తారని సిబ్బంది వివరించారు.
'రాజకీయ నేతల నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల వరకు అనేక మందికి తాజ్ మహల్ హోటల్ ఆతిథ్యం ఇస్తూ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అంతటి హడావుడిలో కూడా ప్రవేశ ద్వారం వద్ద ఓ జీవి ప్రశాంతంగా నిద్రపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యాపారతో పాటు సాటి జీవుల పట్ల మానవతా కోణాన్ని కూడా ఇక్కడ గమనించాను' అంటూ లింక్డ్ ఇన్‌లో ఈ ఘటన వివరాలను ఖాన్ పంచుకున్నారు.
ఈ పోస్ట్ పై తాజ్ హోటల్స్ కూడా తిరిగి స్పందించింది. 'హాయ్ రూబీ, ఈ కథనాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. తాజ్ కరుణతో పాటు అక్కున చేర్చుకునేందుకు విలువనిస్తుంది. ప్రతి అతిథి ఇక్కడ ఇంట్లో ఉండేలా చూస్తాము. మీ పోస్ట్ మా విలువలకు ప్రతిబింబం' అని రిప్లై ఇచ్చింది. 'వాహ్ తాజ్' అంటూ పలువురు యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications