హాస్టల్, PG రెసిడెంట్స్‌కు షాక్.. అద్దెలపై భారీగా GST.. పెరగనున్న స్టూడెంట్స్ ఖర్చులు
GST: ఉన్నత చదువులు, ట్రైనింగ్ లేదా జాబ్ రీత్యా వేలాది మంది స్టూడెంట్స్ హాస్టల్స్ లేదా PGల్లో ఉంటున్నారు. తద్వారా తక్కువ ఖర్చుతో పని కానిచ్చేస్తున్నారు. అయితే అలాంటి వారికి ఇది నిజంగా దుర్వార్తనే చెప్పాలి. ఎందుకంటే హాస్టల్ లేదా PGకి చెల్లించే అద్దెలపైనా GST విధించవచ్చట. ఈ తీర్పు వల్ల హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఖర్చు తడిసి మోపెడవనుంది.
కేవలం సొంత లేదా అద్దె నివాస గృహాలకు మాత్రమే GST నుంచి మినహాయింపు ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ పేర్కొంది. హాస్టల్ లేదా PGలో వసతి కోసం చెల్లించే అద్దెపై 12 శాతం GST వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెండు వేర్వేరు కేసుల్లో ఇదే తరహా తీర్పును వెలువరించింది.

కర్ణాటకలో PGలు, హాస్టళ్లను అభివృద్ధి చేసే శ్రీసాయి లగ్జరియస్ స్టే LLP.. AAR ముందు ఓ ధరఖాస్తు దాఖలు చేసింది. తాము నిర్వహించే ఈ స్థలాలు అద్దె నివాస గృహాల మాదిరిగానే ఉన్నందున.. దానిపై GST విధించకూడదని కోరింది. ఈ రిక్వెస్ట్ ను AAR తిరస్కరించింది. GST చట్టం ప్రకారం జూలై 17, 2022 వరకు ఆ అవకాశం ఉందని, అనంతరం ఈ తరహా స్టేస్ పై 12 శాతం GST విధించవచ్చని వెల్లడించింది.
వ్యక్తిగత వంటగది సౌకర్యం లేకుండా ఒకే గదిని పలువురు షేర్ చేసుకుంటే అది నివాసం పరిథిలోకి రాదని AAR తేల్చి చెప్పింది. అటువంటి అకామిడేషన్స్ పై GST విధించవచ్చని వెల్లడించింది. వాషింగ్ మెషీన్, TV వంటి ఇతర సేవలు దీనిలో బండిల్ చేయబడలేదు కాబట్టి వాటికి విడిగా పన్ను విధించబడుతుందని పేర్కొంది.
నివాస గృహాలతో పాటు రోజుకు వెయ్యి వరకు అద్దె చెల్లించే హోటళ్లు, సత్రాలు, అతిథి గృహాలకు కూడా గతంలో GST నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ మినహాయింపును ఎత్తివేయాలని 2022లో ప్రభుత్వం భావించింది. అదే ఏడాది జూలైలో ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆనెల 18 నుంచి అమల్లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications