HongKong: ఉచితంగా హాంకాంగ్ ట్రిప్ కు వెళ్లాలని ఉందా ? అయితే ఇలా చేయండి..
HongKong: కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీఅతలాకుతలమైన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాలు కారణంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక పొరుగు దేశాలైన శ్రీలంక పాకిస్తాన్ లు దివాళా స్థితికి చేరడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ తరహా పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరి కొన్ని దేశాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పర్యాటకు రంగం ద్వారా వివిధ దేశ పౌరులను ఆకర్షించడానికి హాంకాంగ్ ఓ ఆఫర్ ను ప్రవేశపెట్టి వార్తల్లో నిలిచింది.

వరల్డ్ ఆఫ్ విన్నర్స్:
హాంకాంగ్ పర్యటనకు వచ్చే సందర్శకులకు 5 లక్షల ఉచిత విమాన టికెట్లను అందించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది . బుధవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా, ప్రస్తుతం నష్ట నివారణ చర్యలకు దిగింది. 'వరల్డ్ ఆఫ్ విన్నర్స్' పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి.. కేథే పసిఫిక్ ఎయిర్ వేస్, హాంకాంగ్ ఎయిర్ లైన్స్, గ్రేటర్ బే ఎయిర్ లైన్స్, హెచ్ కె ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థలు ద్వారా టికెట్లు అందించనున్నట్లు పేర్కొంది.

నెలకో రీజియన్:
విదేశీయులకు 5 లక్షల ఉచిత టికెట్లతో పాటు, స్థానికుల కోసం మరో 80 వేలు కేటాయించినట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది.గ్వాంగ్‌డాంగ్-హాంకాంగ్-మకావో గ్రేటర్ బే ఏరియాల్లో కొన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. 65 శాతం టికెట్లను విమానయాన సంస్థల ద్వారా ఇవ్వనుండగా, మిగిలిన మొత్తాన్ని పర్యాటక అనుబంధ రంగాలకు కేటాయించినట్లు స్పష్టం చేసింది. మొదటి దశ ఆగ్నేయాసిలో మార్చి 1 నుంచి, రెండో దశలో ఏప్రిల్ నుంచి చైనా లో, మేలో ఈశాన్య ఆసియాలో, జూలై నుంచి హాంకాంగ్ లో ఈ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.

లక్కీ డ్రా ద్వారా ఎంపిక:
ఈ ఉచిత టికెట్ల కోసం వినియోగదారులు రెండు విధాలుగా నమోదు చేసుకోవచ్చు. హాంకాంగ్ ఎయిర్ పోర్ట్ వెబ్ సైట్ లాటరీలో పాల్గొనవచ్చు లేదా ఏదైనా ఎయిర్ లైన్స్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. అయితే విజేతలు లక్కీ డ్రా ద్వారా లేదా వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఎంపిక చేయబడతారని ఆదేశం పేర్కొంది. ఈ టికెట్లన్నీ ఎయిర్ పోర్ట్ అథారిటీ ద్వారా స్పాన్సర్ చేయబడతాయని స్పష్టం చేసింది. ఇవన్నీ ఎకానమీ క్లాసు టికెట్లు కాగా.. సంబంధిత ఫీజులు, పన్నులను విజేతలే భరించాల్సి ఉంటుంది. హాంకాంగ్ కి, అక్కడి నుంచి తిరిగి రావడానికి రెండు వైపులా ప్రయాణం కోసం వీటిని అందుబాటులో ఉంచనుంది.


Click it and Unblock the Notifications