Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. ధరలు తగ్గుతాయా..!
సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి కళగా ఉంటుంది. అందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయడానికి భారీగా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలు తగ్గిపోయిందని పలు నివేదికలు వచ్చాయి. ఇందుకు సంబంధించి క్రెడాయ్ హైదరాబాద్ - క్రె మ్యాట్రిక్స్ ఓ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నగరంలో ఇళ్ల కొనుగోళ్లు 13 శాతం క్షీణించాయి. ప్రథమార్థంలో ఇళ్లు విక్రయాలు 26,068 యూనిట్లకు తగ్గాయి. గత 4.5 ఏళ్ల కాలంలో (2022 తర్వాత) ఇదే అత్యల్ప అర్ధవార్షిక విక్రయాల సంఖ్య అని నివేదిక పేర్కొంది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఇళ్ల కొనుగోలు తగ్గినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. సగటు ఇంటి విక్రయ ధర గత ఏడాది రూ.1.85 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ.2.03 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 10 శాతం ధరలు పెరిగాయి. సగటు ఇంటి పరిమాణం 2,300 చదరపు అడుగులుగా ఉంది. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో రూ.52,913 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు క్రెడాయ్ హైదరాబాద్ - క్రె మ్యాట్రిక్స్ తమ నివేదికలో పేర్కొన్నాయి. బెంగళూరు, ముంబైల తర్వాత దేశంలోనే అత్యధిక విక్రయ విలువ కలిగిన మూడో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్ ఉందని తెలిపింది.

ఐటీ రంగానికి చెందిన అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐల నుంచి వస్తున్న పెట్టుబడులు తగ్గాయని... ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల ప్రీమియం గృహ విభాగానికి ఆదరణ తగ్గిందని నివేదిక పేర్కొంది. రూ.2 కోట్లకు పైబడిన ఇళ్లను కొనడానికి వేతన జీవులు ఇష్టపడడం లేదు. వారంతా రెంట్ ఉండడానికి ఇష్టపడుతున్నారు. గల్ఫ్ యుద్ధ వాతావరణం, నిర్మాణ వ్యయాలు పెరగడం, సోషల్ మీడియాలో ధరల పెరుగుదలపై ప్రతికూల ప్రచారాలు సైతం కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయని నివేదిక వివరించింది. అయితే చాలా మంది బిల్డర్లు భారీగా ఇళ్ల ధరలు పెంచడంతో కొనుగోలు చేసేవారు వెనకాడుతున్నారు.
అంతేకుండా డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను భారీగా ప్రారంభించడంతో డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో 49,656 కొత్త ఇళ్లు లాంచ్ కాగా (37% పెరుగుదల), అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 21% పెరిగి 1,42,722 యూనిట్లకు చేరినట్లు వివరించింది. వీటిని విక్రయించడానికి దాదాపు 29 నెలల సమయం పడుతుందని అంచనా నివేదిక అంచనా వేసింది. అయితే, ఈ అమ్ముడుపోని నిల్వలో కేవలం 20 శాతం (దాదాపు 30,000 ఇళ్లు) మాత్రమే తక్షణమే నివాసానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి 2027-2029 లేదా ఆ తర్వాత పూర్తవుతాయని తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
