Home Loan EMI: సొంత ఇల్లు కలిగి ఉండటం లేదా కొనటం అనేది జీవితకాల కల. మధ్యతరగతి నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ఇదొక పెద్ద కల. ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రజల ఆదాయాలు గతంతో పోల్చితే మెరుగుపడటంతో బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలను పొందటం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడొక తీపి కబురు ఉంది.
హోమ్ లోన్స్ కొత్తగా పొందనున్న వ్యక్తులకు మంచి కాలం ముందు మిగిలే ఉంది. గృహరుణానికి చెల్లించే నెలవారీ ఈఎంఐ ఫిబ్రవరి 2025లో తగ్గనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం రానున్న కాలంలో బ్యాంకులు తగ్గించనున్న వడ్డీ రేట్లే కారణంగా తెలుస్తోంది. గతవారం జరిగిన ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని రిజర్వు బ్యాంక్ గవర్నర్ నిర్ణయించిన వేళ.. ఫిబ్రవరిలో జరిగే సమావేశంపైనే అందరి ఆశలు కొనసాగుతున్నాయి. ఈసారి జరిగే సమావేశంలో రెపో రేటును ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది జరిగే ఎంపీసీ సమావేశాల్లో పలు దఫాలుగా 25 బేసిస్ పాయింట్ల చొప్పున దాదాపు 100 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రుణ గ్రహీతలకు ఈఎంఐ భారాన్ని తగ్గించనుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రసుఖ రేటింగ్ సంస్థ నోమురా సైతం భారతీయ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఒకపక్క అగ్రరాజ్యం అమెరికా వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెబుతున్నవేళ, ఇండియాలో మాత్రం జీడీపీ పడిపోవటం దగ్గరి నుంచి డిమాండ్ తగ్గటం వరకు అన్నింటా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఏకంగా బీజేపీలోని కేంద్ర మంత్రులే బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాలని, డిమాండ్ బూస్ట్ చేసేందుకు కంపెనీలు లాభాలను తగ్గించుకోవాలని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా దీనికోసం రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో తగ్గింపులను కోరకపోవటం గమనార్హం అంటూ చాలా మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రుణగ్రహీతలకు రూ.3200 లాభం ఇలా..
రానున్న కొత్త సంవత్సరంలో రిజర్వు బ్యాంక్ క్రమంగా వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినప్పుడు హోమ్ లోన్స్ పొందిన రుణగ్రహీతల ఈఎంఐ చెల్లింపుల భారం గణనీయంగా తగ్గనున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనేక బ్యాంకులు దేశంలో హోమ్ లోన్స్ పై దాదాపు 9.75 శాతం వకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు 9.25% వడ్డీ రేటుతో 20 ఏళ్లపాటు రూ.50 లక్షల రుణం తీసున్నట్లయితే సదరు వ్యక్తి నెలకు రూ.45,793 ఈఎంఐ కింద చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు 100 బేసిస్ పాయింట్లు తగ్గటం వల్ల రెపో లింక్డ్ వడ్డీ రేటు 1 శాతం తగ్గి రుణగ్రహీత చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ రూ.42,603కి తగ్గుతుంది. దీని ద్వారా నెలకు రూ.3190 వరకు వారికి ఈఎంఐ భారం తగ్గిపోతుంది.


Click it and Unblock the Notifications