హోమ్ లోన్ భారం తగ్గాలా? ఈజీగా వేరే బ్యాంక్‌కు మార్చేసి.. లక్షల రూపాయలు మిగిల్చుకోండి!
చాలామంది ఇల్లు కొనేటప్పుడు ఒకసారి హోమ్ లోన్ (home loan) తీసుకున్నాక, ఇక దాని గురించి పెద్దగా ఆలోచించరు. ప్రతి నెలా అకౌంట్ నుండి ఈఎంఐ (EMI) కట్ అవుతుంటుంది, లైఫ్ అలా సాగిపోతుంటుంది. కానీ, మీకు తెలుసా? మీ లోన్ జీవితకాలం మొత్తం ఒకే బ్యాంకులో కొనసాగాల్సిన అవసరం లేదు. వేరే ఏదైనా బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తే, మీ మిగిలిన లోన్ మొత్తాన్ని ఆ కొత్త బ్యాంకుకు మార్చుకోవచ్చు. దీనినే 'హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' అంటారు. సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటే లక్షల రూపాయలు ఆదా అవుతాయి. కానీ, సరిగ్గా లెక్కలు వేసుకోకపోతే మాత్రం ఇదొక వృధా ప్రయాస అవుతుంది.

అసలు ఈ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎలా పనిచేస్తుంది?
ఇది ఒక రకమైన రీఫైనాన్సింగ్ లాంటిది. మీరు లోన్ మార్చాలనుకున్నప్పుడు, కొత్త బ్యాంక్ మీ పాత బ్యాంకుకు ఉన్న లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించి, ఆ అప్పును తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత నుండి మీరు కొత్త బ్యాంకుకు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఇల్లు మారదు, మీరూ మారరు.. కేవలం మారేది మీ బ్యాంక్ , వడ్డీ నిబంధనలు మాత్రమే.
వడ్డీ రేట్లలో తేడా.. భారీ ఆదా!
ఇన్వెస్టర్లు లోన్ ట్రాన్స్‌ఫర్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం 'పొదుపు'. ఉదాహరణకు, మీరు ప్రస్తుతం మీ హోమ్ లోన్‌పై 9.25 శాతం వడ్డీ కడుతున్నారు అనుకుందాం. అదే వేరే బ్యాంక్ మీకు 8.25 శాతానికే ఇస్తామని ముందుకొచ్చింది. కేవలం ఒక శాతం తేడానే కదా అని తక్కువ అంచనా వేయకండి. లోన్ మొత్తం పెద్దదై, కట్టాల్సిన కాలపరిమితి (Tenure) ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ ఒక్క శాతం తేడాతోనే మీ వడ్డీ భారం లక్షల రూపాయల వరకు తగ్గిపోతుంది.
కొందరు వడ్డీ తగ్గినా ఈఎంఐ అలాగే ఉంచి, లోన్ త్వరగా తీరిపోయేలా చూసుకుంటారు (Tenure Reduction). మరికొందరు ప్రతి నెలా చేతిలో డబ్బులు ఎక్కువగా మిగలాలని ఈఎంఐ తగ్గించుకుంటారు (EMI Reduction). మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.
కేవలం వడ్డీ రేటు మాత్రమే చూడకండి!
ఇక్కడే చాలామంది పొరపాటు పడుతుంటారు. కొత్త బ్యాంక్ బోర్డులపై వేసే తక్కువ వడ్డీ రేట్ల ప్రకటనలు చూసి మోసపోకూడదు. లోన్ ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకు మార్చేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ చార్జీలు, వ్యాల్యుయేషన్ ఫీజులు , అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు ఉంటాయి. కొత్త బ్యాంక్ ఇచ్చే ఆఫర్ వల్ల మీకు మిగిలే లాభం కంటే.. ఈ చార్జీల ఖర్చే ఎక్కువగా ఉంటే, లోన్ మార్చడం వల్ల రూపాయి ఉపయోగం ఉండదు.
టైమింగ్ చాలా ముఖ్యం
మీ హోమ్ లోన్ కాలపరిమితి ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హోమ్ లోన్ మొదటి సంవత్సరాలలో మనం కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే పోతుంది, అసలు చాలా తక్కువగా తగ్గుతుంది. కాబట్టి స్టార్టింగ్‌లో వడ్డీ రేటు తగ్గితే లాభం ఎక్కువ. ఒకవేళ మీ లోన్ ముగింపు దశకు వస్తే (ఇంకా 3 లేదా 4 ఏళ్లు మాత్రమే ఉంటే), అప్పుడు మారడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికే మీరు కట్టాల్సిన వడ్డీ అంతా కట్టేసి ఉంటారు.
క్రెడిట్ స్కోర్ మరువకండి
లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అంటే కొత్తగా లోన్ అప్లై చేయడమే. కొత్త బ్యాంక్ మీ ఆదాయం, ఉద్యోగం, రీపేమెంట్ హిస్టరీ , ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ (Credit Score) ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరికైతే క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా బాగుంటుందో, వారికే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయి. కాబట్టి ఉత్సాహపడి అడుగులు వేసే ముందు, మీ చేతిలో ఉన్న మిగిలిన లోన్ ఎంత? కొత్త బ్యాంక్ వసూలు చేసే ఫీజులు ఎంత? మీకు నిజంగా మిగిలే లాభం ఎంత? అనే కంప్లీట్ మ్యాథ్స్ వర్కవుట్ అయినప్పుడు మాత్రమే హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications