8 గంటలు రోడ్డుపై క్యూలో నిలబడిన జనం.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!
ప్రముఖ నగరాల్లో ఓ పక్క భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లకై వినియోగదారులు ఎగబడుతున్నారు. ఖర్చు కొంచెం ఎక్కువైనా సకల సౌకర్యాలు ఉండే ఫ్లాట్స్ సొంతం చేసుకునేందుకు పరుగెత్తుతున్నారు. తాజాగా ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో చూస్తే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతుంది.
సామాజిక మాధ్యమం Xలో ఓ యూజర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పూణేలోని ఓ విలాసవంతమైన భవనం బయట పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడి ఉండటం అందులో చూడొచ్చు. ఆ అపార్ట్‌మెంట్‌లోని కోట్ల విలువైన ఫ్లాట్స్ కొనుగోలుకు ముందు పరిశీలించడం కోసం లోనికి వెళ్లేందుకు వారు 8 గంటల పాటు వేచి ఉన్నట్లు తెలుస్తోంది.

నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోని వాకాడ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. 1.5 నుంచి 2 కోట్ల విలువైన అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ కొనుగోలు చేసేందుకు పూణే వాసులు పెద్ద సంఖ్యలో రోడ్లపై క్యూలో నిలబడ్డారు. ఈ వ్యవహారాన్ని ఓ యూజర్ వీడియో తీసి తన X ఖాతాలో పోస్ట్ చేయడంతో పలువురు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్లాట్స్ కొనడానికి ఇంతసేపు వేచి ఉన్నారు అంటే నమ్మడానికి కొందరు నిరాకరిస్తున్నారు. తమ ఖాతాలో 2 కోట్లు ఉన్న వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారని అనుకోవడం లేదని, కేవలం బ్యాంకులను బాగుచేయడానికే వారు ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది జస్ట్ బిల్డర్ మార్కెటింగ్ ప్లాన్ కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications