HNIs flee from India: చదువు లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని దేశీయ యువత భావిస్తుంటారు. అందుకోసం ఎంతగానో కష్టపడుతుంటారు. అక్కడ బాగా సంపాదించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడో సంపాదించి భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు బదులుగా ఇక్కడ బాగా వెనకేసుకుని విదేశాలకు చెక్కేసేవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ విశ్లేషకులు చెబుతున్న ప్రధాన కారణం మాత్రం ఒకటే.
ఈ ఏడాది దాదాపు నాలుగున్నర వేల మంది భారతీయ మిలియనీర్లు దేశం దాటవచ్చని ప్రముఖ బ్రిటీష్ ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్నర్స్ తెలిపింది. దేశంలో పన్ను రేట్లు ఎక్కువగా ఉండడమే దీనికి ముఖ్య కారణంగా పేర్కొంది. వీరంతా పన్ను రహిత లేదా అతి తక్కువ పన్నులు విధిస్తున్న దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వాలిపోయేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నట్లు తన నివేదికలో వెల్లడించింది.

గతేడాది 5 వేలకు పైగా భారతీయులు దేశాన్ని వదిలి వెళ్లినట్లు హెన్లీ సంస్త తన రిపోర్టులో పేర్కొంది. ఇలా దేశం దాటుతున్న మిలినియర్ల జాబితాలో అమెరికా, చైనా, భారత్‌లు టాప్ ప్లేస్ లో ఉన్నాయని తెలిపింది. ఈ 3 దేశాల నుంచి 6 వేల 500కు పైగా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (HNI)లు వలస వెళ్తారని అంచనాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గోల్డెన్ వీసాలు, విద్య వైద్య సదుపాయాలు, పెట్టుబడి రాయితీలు వంటివి ఇస్తూ సదరు దేశాలు వారిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది .
ఈ విధంగా పలువురు వ్యాపారవేత్తలు తరలివెళ్తున్న టాప్ 10 దేశాల జాబితాను సైతం హెన్లీ అండ్ పార్టనర్స్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో UAE టాప్ పొజిషన్ చేజిక్కించుకోగా.. అమెరికా, కెనడాలు తర్వాత స్థానంలో నిలిచాయి. ఇక కెనడా, బార్బుడా, ఆంటిగ్వా వంటి దేశాల్లోని పెట్టుబడి అవకాశాలు కూడా భారతీయులను అద్భుతంగా ఆకర్షిస్తున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. అయితే కేవలం వ్యాపార అవకాశాలే కాకుండా పిల్లల సంరక్షణ, జీవన శైలి కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించింది.


Click it and Unblock the Notifications