Railways News: రైల్వేశాఖ పాలిట ఆ ట్రైన్ కల్పవృక్షం.. అత్యధిక ఆదాయం ఆర్జించే రైలు అదే..
Most Profitable train: భారతీయుల జీవితాల్లో రైల్వేలకు ఓ ప్రముఖ స్థానం ఉంది. అందుకే గతంలోని ప్రభుత్వాలు కూడా ఈ శాఖకు ప్రత్యేక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. అత్యంత తక్కువ ఖర్చుతో సామాన్యుడు దర్జాగా ప్రయాణించే సౌలభ్యాన్ని భారతీయ రైల్వేలు అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, ప్రముఖ నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలతో సైతం మంచి కనెక్టివిటీ కలిగి ఉన్నాయి. మరి ఈ రైళ్ల ద్వారా వచ్చే ఆదాయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ?
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న దేశం ఇండియా. గణాంకాల ప్రకారం ప్రతిరోజూ 20 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ట్రాక్‌ల మీదుగా రోజూ 13 వేల 452 రైళ్లు నడుస్తూ ఉంటాయి. అయితే వీటిలో అత్యంత లాభదాయకమైన రైలు ఏడాదికి 176 కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ చేస్తోంది. ఈ రికార్డు సృష్టించింది శతాబ్ది లేదా వందే భారత్ రైళ్లు కాకపోవడం విశేషం.

రాజధాని రైళ్ల ద్వారా రైల్వే శాఖకు అధిక ఆదాయం వస్తోంది. వాటిలోనూ ముఖ్యంగా బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయం పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి KSR బెంగళూరు (రైలు నంబర్ 22692) వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు 5.09 లక్షలకు పైగా ప్రయాణీకులను రవాణా చేసింది. తద్వారా 176 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది.
ఇక దాని తరువాతి స్థానంలో సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12314) అత్యంత లాభదాయకమైన రైలుగా నిలిచింది. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.09 లక్షలకు పైగా ఇందులో ప్రయాణించారు. రైల్వే శాఖకు ఈ రైలు 128.81 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టింది.
దిబ్రూఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. న్యూఢిల్లీ మరియు డిబ్రూఘర్ మధ్య నడిచే ఈ రైలు.. గత సంవత్సరంలో 4.74 లక్షల మందికి సేవలందించింది. దీని ద్వారా రైల్వే శాఖ 126.29 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. వీటికున్న డిమాండ్ దృష్ట్యా పలు రైళ్లకు మరిన్ని బోగీలను యాడ్ చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications