సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..
పసిఫిక్ మహాసముద్రం అంతర్భాగంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించే క్రమంలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. న్యూజిలాండ్‌కు ఉత్తర దిశలో విస్తరించి ఉన్న కెర్మాడెక్ ఆర్క్ అనే అగ్నిపర్వత ప్రాంతంలో జరిపిన పరిశోధనలు, భూమి లోపల ఒక భారీ 'బంగారు కర్మాగారం' నడుస్తోందని నిరూపించాయి.
సాధారణంగా Gold అనేది భూమి పొరల్లో ఎక్కడో ఒకచోట స్థిరంగా నిక్షిప్తమై ఉంటుందని మనం భావిస్తాం. కానీ, ఈ తాజా అధ్యయనం ఆ భావనను పూర్తిగా మార్చివేసింది. భూమి లోపల బంగారం నిరంతరం చలనంలో ఉంటుందని, అది ఒక క్రమ పద్ధతిలో ఒక చోట నుండి మరో చోటికి రవాణా అవుతూ, నిర్దిష్ట ప్రాంతాల్లో భారీ నిక్షేపాలుగా పేరుకుపోతుందని పరిశోధకులు గుర్తించారు.
ఈ ఆవిష్కరణలో కీలకమైనవి అగ్నిపర్వత గాజు నమూనాలు. భూమి అంతర్భాగంలోని అత్యంత లోతైన ప్రాంతాల నుండి ద్రవరూపంలో పైకి వచ్చే లావా, సముద్రపు నీటిని తాకినప్పుడు వేగంగా చల్లబడి ఈ గాజు ముక్కలుగా మారుతుంది. శాస్త్రవేత్తలు ఈ నమూనాలను పరీక్షించినప్పుడు, వాటిలో సాధారణంగా ఉండాల్సిన దానికంటే అత్యధిక మోతాదులో Gold ఉన్నట్లు కనుగొన్నారు.
ఇది భూమి లోపల జరుగుతున్న అద్భుతమైన రసాయనిక, భౌతిక ప్రక్రియలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. భూమి లోపల కిలోమీటర్ల లోతులో బంగారం సాధారణంగా సల్ఫైడ్ ఖనిజాల మధ్య బంధించబడి ఉంటుంది. అంటే అవి ఆ ఖనిజ పొరల నుండి విడిపోయి బయటకు రావడం అంత సులభం కాదు.

అయితే భూమి యొక్క ఫలకాలు (Tectonic Plates) ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా ఒక ఫలకం మరొక దాని కిందకు జారినప్పుడు అక్కడ విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే విపరీతమైన ఉష్ణోగ్రత, పీడనం కారణంగా కఠినమైన శిలలు సైతం కరగడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలోనే సల్ఫైడ్ ఖనిజాలు విచ్ఛిన్నమై, వాటిలో దాగి ఉన్న బంగారం విడుదలవుతుంది. ఇలా విడుదలైన బంగారం కరిగిన శిలలతో (మాగ్మా) కలిసిపోతుంది. ఈ మాగ్మా సాంద్రత తక్కువగా ఉండటం వల్ల అది నెమ్మదిగా భూ ఉపరితలం వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో బంగారం కూడా మాగ్మాతో పాటు పైకి చేరుకుంటుంది. ఇలా లక్షలాది సంవత్సరాలుగా ఈ ప్రక్రియ పునరావృతం కావడం వల్లే కొన్ని అగ్నిపర్వత ప్రాంతాల చుట్టూ భారీగా బంగారు నిక్షేపాలు పోగుపడుతున్నాయి.
అందుకే శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను "సహజ బంగారు కర్మాగారం" అని పిలుస్తున్నారు. అయితే ఇది కొత్తగా బంగారాన్ని సృష్టించదు. కేవలం భూమి అంతర్భాగంలో చెల్లాచెదురుగా ఉన్న బంగారాన్ని సేకరించి ఒకచోట కేంద్రీకరిస్తుంది. ఈ ఆవిష్కరణలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రక్రియ ఏదో ఒక కాలంలో జరిగి ఆగిపోయింది కాదు.. ఇది ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. పరిశోధకులు సేకరించిన దాదాపు అన్ని నమూనాలలో బంగారం పరిమాణం ఎక్కువగా ఉండటం, ఈ వ్యవస్థ ఎంత శక్తివంతంగా పని చేస్తోందో తెలియజేస్తుంది.
అయితే, ఇంత భారీ స్థాయిలో బంగారం ఉన్నప్పటికీ, దానిని వెలికితీయడం మానవమాత్రులకు ప్రస్తుతానికి అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఈ నిక్షేపాలు సముద్రపు అడుగున అత్యంత లోతైన, దుర్భరమైన పరిస్థితులు ఉన్న చోట నిక్షిప్తమై ఉన్నాయి. అక్కడ ఉండే విపరీతమైన నీటి పీడనం, చీకటిలో మైనింగ్ చేయడం సాంకేతికంగా, ఆర్థికంగా సవాలుతో కూడుకున్న పని. ఏది ఏమైనప్పటికీ, ఈ పరిశోధన బంగారం పుట్టుక, పంపిణీపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చివేసింది. బంగారం అనేది యాదృచ్ఛికంగా దొరికే లోహం కాదు, అది భూమి యొక్క సహజ సిద్ధమైన భౌగోళిక మార్పులలో ఒక భాగమని, భూమి నిరంతరం తనలో తాను ఇటువంటి విలువైన సంపదను పోగు చేసుకుంటోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications