Recruitment News: గత కొన్నేళ్లుగా IT ఉద్యోగుల జీవితాలను భయం ఆవహించింది. ఎప్పుడు తమ కంపెనీ లేఆఫ్స్ ప్రకటిస్తుందో తెలియని మీమాంసలో బతుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మెల్లగా మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. లేఆఫ్స్ పూర్తిగా ఆగిపోనప్పటికీ కొన్ని కంపెనీలు కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయి.
ప్రముఖ IT సేవల సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను 6 వేల నుంచి 8 వేల వరకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భారతదేశం నుంచి సుమారు 4 వేల మంది సిబ్బందిని చేర్చుకోనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాలసుబ్రమణియన్ ప్రకటించారు. కాగా నవీ ముంబైకి చెందిన ఈ కంపెనీలో ప్రస్తుతం దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

భారత్ సహా US, కెనడా, మెక్సికో, పోలాండ్ మరియు UKలలో ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించడానికి హెక్సావేర్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు రాజేష్ తెలిపారు. దీనిలో భాగంగా ఇండియాలోని అహ్మదాబాద్, ఇండోర్, పూణే, ముంబై, చెన్నై, డెహ్రాడూన్, కొచ్చి మరియు తిరువనంతపురంలలో డ్రైవ్స్ చేపడుతోంది. USలో మెక్లీన్, చికాగో, డల్లాస్, ఇసెలిన్, రెస్టన్‌లలో నియామకాలు ప్రారంభించింది. పోలాండ్ మరియు UKలలోని నిర్దిష్ఠ ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంది.
దీనికితోడు ఇండియాలోనూ హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, డెహ్రాడూన్ మరియు బెంగళూరుతో సహా పలు ఇతర నగరాల్లోకి విస్తరించాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం పెద్ద సంఖ్యంలో ఆఫీసులను అద్దెకు తీసుకోవాలని యోచిస్తోంది. కాగా ఇప్పటికే హెక్సావేర్ 16 దేశాల్లో ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. మొత్తం 45 కార్యాలయాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications