ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్న హీరో మోటోకార్ప్.. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు..
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్, ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని మరింత విస్తరిస్తూ తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలం మదనపాలెం గ్రామంలో తన రెండవ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ (GPC 2.0) నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు నుండి ఐదేళ్లలో రూ. 3,200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలనే కంపెనీ విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ పవన్ ముంజాల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కంపెనీ వ్యవస్థాపకుడు ,ఛైర్మన్ ఎమెరిటస్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ 103వ జయంతి సందర్భంగా ఈ శంకుస్థాపన నిర్వహించడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం హీరో మోటోకార్ప్ ప్రారంభంలో రూ. 750 కోట్లకు పైగా ప్రత్యక్ష పెట్టుబడిని కేటాయించింది. రాజస్థాన్ తర్వాత దేశంలోనే కంపెనీకి ఇది రెండవ అతిపెద్ద గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కానుంది. ఈ కొత్త ల్యాండ్‌మార్క్ సదుపాయం ద్వారా రాయలసీమ ప్రాంతంలో దాదాపు 4,000 మందికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాంట్ హీరో మోటోకార్ప్ యొక్క దేశీయ విడిభాగాల అవసరాలను తీర్చడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు విడిభాగాలు ,కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) కిట్లను సరఫరా చేసే వ్యూహాత్మక లాజిస్టిక్స్ కేంద్రంగా కీలక పాత్ర పోషించనుంది.
ఈ విస్తరణతో తిరుపతి ప్లాంట్ యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న ఆరు లక్షల యూనిట్ల నుండి ఏకంగా 12 లక్షల నుండి 15 లక్షల యూనిట్లకు పెరుగుతుంది. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ తన భవిష్యత్తు గ్రీన్ మొబిలిటీ వ్యూహంలో తిరుపతిని ఒక ప్రధాన కేంద్రంగా మార్చింది. కంపెనీకి చెందిన ప్రసిద్ధ 'వీడా' (VIDA) శ్రేణితో సహా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల (EV) పోర్ట్‌ఫోలియో అంతా 100 శాతం ఇక్కడే డిజైన్, ఇంజనీరింగ్ ,తయారీ చేయబడుతుంది.
పారిశ్రామిక అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రకటించింది. దీని కింద 'డాక్టర్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ హీరోస్ ఆఫ్ టుమారో స్కాలర్‌షిప్' ద్వారా రాష్ట్రంలోని 28 జిల్లాల ట్రిపుల్ ఐటీ (IIIT) ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు సహాయాన్ని అందించనున్నారు.
అలాగే మహిళా పోలీసు సిబ్బంది భద్రత ,రవాణా కోసం వీడా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడంతో పాటు ప్రత్యేక రోడ్డు భద్రతా శిక్షణను కూడా నిర్వహించనున్నారు. ఈ పెట్టుబడి తిరుపతి-శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతాన్ని దేశంలోనే అగ్రగామి ఆటోమొబైల్ ,ఈవీ హబ్‌గా నిలబెడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications
