ఉద్యోగులందరికీ మైండ్ బ్లోయింగ్ బోనస్.. కంపెనీ అంటే ఇలా కదా ఉండాలి!
కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయా సంస్థలు సాధారణంగా ప్రతి ఏటా బోనస్ లు ఇస్తుంటాయి. వచ్చిన లాభాల్లో కొంత మేరకు ఇందుకోసం వెచ్చిస్తాయి. ఒక నెల జీతం అదనంగా ఇవ్వడం లేదా సిబ్బంది కేటగిరీని బట్టి కొంత మొత్తాన్ని వారి ఖాతాలకు జమచేయడం జరుగుతుంది. కానీ ఓ సంస్థ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన ఉద్యోగులు అందరికీ భారీగా బోనస్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తింది.

భారీ బోనస్
ఫ్రాన్స్ కు చెందిన లగ్జరీ బ్రాండ్ హెర్మేస్ తన ఉద్యోగులకు రూ.3.5 లక్షల భారీ బోనస్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 వేల సిబ్బంది మొత్తానికి విడివిడిగా ఈ మొత్తాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది తమ ఉత్పత్తుల అమ్మకాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు చెప్పింది.
తద్వారా భారీగా లాభాలు వచ్చినట్లు తెలిపింది. అందుకే ఉద్యోగులకు బహుమతిగా బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి చివరి నాటికి ఈ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో పడనున్నట్లు తెలుస్తోంది.

ఏడాదిలోనే 17 నెలల జీతం
గతేడాది సైతం హెర్మేస్ ఉద్యోగుల జీతాన్ని 6 శాతం పెంచింది. ఇది కాకుండా 2022 జనవరిలో సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.8,700 చొప్పున అధికంగా వేతనాలు ఇచ్చింది. తిరిగి జూలైలో మరోసారి రెన్యువల్ చేసింది. తాజాగా భారీ బోనస్ ను ప్రకటించింది. ఈ బోనస్ తో పాటు ఇతర ప్రోత్సాహకాలను పరిగణలోనికి తీసుకుంటే, ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 17 నెలలకు సమానమైన వేతనాన్ని కంపెనీ నుంచి ఉద్యోగులు పొందారన్నమాట.

పెద్దఎత్తున ఆదాయ వృద్ధి
హెర్మేస్ అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఫ్యాషన్ కంపెనీ. 2022లో దాని ఆదాయం 11.6 బిలియన్ యూరోలు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 23 శాతం పెరిగింది. ఇది లెదర్ ఐటమ్స్, ఫ్యాషన్ ఉపకరణాలు, ఇతర లైఫ్ స్టైల్ కు సంబంధించి లగ్జరీ వస్తువులను తయారుచేస్తుంది.
చేతితో కుట్టిన హ్యాండ్ బ్యాగ్ ల తయారీలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. ఒక్క ఫ్రాన్స్ లోనే దాదాపు 12,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆ కంపెనీ CEO ఆక్సెల్ డుమాస్ గత వారం తెలిపారు.


Click it and Unblock the Notifications