భారీ వర్షాలకు హైదరాబాద్ విలవిల.. మరో 3 రోజులు యమ డేంజర్.. స్కూళ్లకు సెలవులు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
heavy rains in Hyderabad: హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో వణుకుతోంది. మరో మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం భారీ వర్షాల హెచ్చరికలతో అత్యవసర చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఈ రోజు హాఫ్ డే విధానాన్ని అమలు చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలు ఉదయం షిఫ్ట్ వరకు మాత్రమే పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండే పని చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ సూచించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి సురక్షిత ప్రయాణ మార్గదర్శకాలు, అత్యవసర సంప్రదింపు పద్ధతులపై అంతర్గత సలహాలు ఇవ్వాలని సంస్థలను కోరారు.
ఆగస్టు 13, 14 తేదీలలో హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించబడింది. IMD అంచనా ప్రకారం, 13 నుండి 15 వరకు తెలంగాణలో అనేక జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సైబరాబాద్ పరిసరాలు అత్యధిక ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షపాతం 10-15 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వరకు చేరవచ్చని అంచనా.

రెడ్ అలర్ట్ జిల్లాల విషయానికి వస్తే.. హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఉన్నాయి. ఇక ఆరెంజ్ అలర్ట్ విషయానికి వస్తే.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి మరియు పరిసర జిల్లాలు ఉన్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో వంతెనలు, వాగులు, కాజ్‌వేలపై వాహనాల రాకపోకలు నిలిపివేయాలని, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే నాలుగు రోజుల పాటు అన్ని నీటిపారుదల అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్ని జలాశయాలు, కాలువలు, ట్యాంకులపై నిఘా ఉంచి, ఏవైనా ప్రమాద సంకేతాలు కనబడితే వెంటనే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఏ నీటిపారుదల అధికారి అయినా తనకు నేరుగా సమాచారం ఇవ్వవచ్చని (మొబైల్ నంబర్ 7036836869) తెలిపారు.
హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన సంస్థ (HYDRAA), లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. GHMC, HYDRAA బృందాలు అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉన్నాయని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తెలిపారు.


Click it and Unblock the Notifications