తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మరో 3 రోజులు భారీ వర్షాలు, ఐటీ ఉద్యోగుకు కీలక సూచన
Heavy Rain in Hyderabad : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది.ఈ అల్పపీడనం కాస్తా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వాయుగుండం ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా మధ్య, తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో వచ్చే మూడు రోజుల పాటు తెలుగు వర్షాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇక తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ మహానగరానికి వచ్చే 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. భాగ్య న్యగరాన్ని గత 10 రోజుల నుంచి భారీ వర్షాలు వీడటం లేదు. ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, మహారాష్ట్రలను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ నెల (ఆగస్టు) 18, 19 తేదీల్లో కొంకణ్ ప్రాంతం (ముంబైతో సహా) గోవా, మధ్య మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాలు, తీర కర్ణాటకలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ నెల 19, 20 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబైని వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలమైంది. హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 15 పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి.

హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని GHMC హెచ్చరించింది.లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. అవసరమైతే ఈ మూడు రోజుల వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని ఐటీ ఉద్యోగులకు సూచించారు. భారీ వర్షాలకు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండటంతో సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పనిచేయాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
ఇక ఏపీలోని విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు విశాఖపట్నం జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎల్. చంద్రకళ, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసారు.


Click it and Unblock the Notifications