గోల్డ్ ETFలో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్.. హెచ్‌డీఎఫ్‌సీ కొత్త ఆంక్షలు!
మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బంగారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో ముఖ్యమైన అప్‌డేట్. ప్రముఖ ఫండ్ హౌస్ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) తన గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) , గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (FoF) స్కీమ్‌లలో లంప్‌సమ్ (ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టే) పెట్టుబడులపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక , మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. జూన్ 2026 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని పేర్కొంది.

ఎవరికి ఏ పరిమితులు వర్తిస్తాయి?
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇన్వెస్టర్ల కేటగిరీని బట్టి ఈ రూల్స్ మారనున్నాయి.
- HDFC Gold ETF: పెద్ద ఇన్వెస్టర్లు నేరుగా ఫండ్ హౌస్ ద్వారా చేసే సబ్‌స్క్రిప్షన్లను జూన్ 8, 2026 నుంచి అంగీకరించరు. కనీసం రూ. 25 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టే లంప్‌సమ్ పెట్టుబడులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
- HDFC Gold ETF Fund of Fund: ఇందులో లంప్‌సమ్ పర్చేజ్‌లు , స్విచ్-ఇన్ లావాదేవీలను ఒక క్యాలెండర్ నెలలో ఒక పాన్ (PAN) కార్డ్‌పై గరిష్టంగా రూ. 10 లక్షల వరకు మాత్రమే అనుమతిస్తారు. జూన్ 5, 2026 మధ్యాహ్నం 3 గంటల కట్-ఆఫ్ టైమ్ తర్వాత వచ్చే ట్రాన్సాక్షన్లకు ఈ రూల్ వర్తిస్తుంది.
అయితే ఈ రెండు స్కీమ్‌లకు సంబంధించిన మిగతా నిబంధనలు , షరతులలో ఎలాంటి మార్పులు ఉండవని సంస్థ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయానికి అసలు కారణం ఏంటి?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం , వెండి దిగుమతులపై ఎఫెక్టివ్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను (Import Tax) 9.2 శాతం నుంచి ఏకంగా 18.4 శాతానికి పెంచింది. ఈ పన్ను పెంపు మే 13, 2026 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మార్పుల కారణంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరగడంతో.. ఫండ్ హౌస్ ముందస్తు జాగ్రత్తగా ఈ ఆంక్షలను తీసుకొచ్చింది.
దేశంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర
ఒకవైపు ఈ ఆంక్షలు ఇలా ఉంటే, దేశ రాజధాని ఢిల్లీలో లండన్ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా స్పాట్ గోల్డ్ ధర ఏకంగా రూ. 700 పెరిగి.. 10 గ్రాముల బంగారం ధర రూ. 1.60 లక్షల మార్కును దాటేసింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ. 1,60,300 కి చేరుకుంది. అయితే, మరోవైపు వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. కిలో వెండి ఏకంగా రూ. 3,800 తగ్గి రూ. 2,65,700 వద్ద ముగిసింది. ఇలాంటి హాట్ మార్కెట్ సిట్యుయేషన్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు హెచ్‌డీఎఫ్‌సీ కొత్త రూల్స్‌ను గమనించుకుని అడుగులు వేయడం మంచిది!


Click it and Unblock the Notifications