Credit Cards: క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై కొత్త ఛార్జీలు..అలా చేస్తే 1% కట్టాల్సిందేనన్న బ్యాంకింగ్ దిగ్గజం
HDFC News: గతంలో సంపన్నుల చేతిలో ఎక్కువగా కనిపించే క్రెడిట్ కార్డులు ప్రస్తుతం విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. ఇతరుల సంగతి ఎలా ఉన్నా అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు మాత్రం వీటిని విపరీతంగా వినియోగిస్తున్నారు. వ్యాపార లావాదేవీల కోసం ఈ కార్డులను ప్రవేశపెట్టినా, అందుబాటులోని లొసుగులను ఉపయోగించి నగదును సేవింగ్స్ ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. దీంతో నియంత్రణ సంస్థలు, బ్యాంకులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాయి.
అద్దె చెల్లింపుల పేరిట క్రెడిట్ కార్డులు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నట్లు పలు బ్యాంకులు, ఫిన్‌టెక్‌లు గుర్తించాయి. దీంతో నష్టనివారణకు దిగాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC తన క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు ఇమెయిల్‌లో షాక్ ఇచ్చింది. ఫిన్‌టెక్ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుమును విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికి 3 వేల వరకు క్యాప్ విధించింది.

ఇటీవల ICICI మరియు SBI బ్యాంకులు అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్‌లను నిలిపివేశాయి. ఇప్పటి వరకు ఈ విధంగా కేవలం రివార్డ్‌లను మాత్రమే నిలిపివేశారు. అయితే ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC మరో అడుగు ముందుకేసి ఛార్జీలను పరిచయం చేయడంతో పలు ఇతర ప్లేయర్స్ కూడా ఇదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు.
క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి అద్దె చెల్లింపులు ఇటీవల భారీగా పెరగడంతో బ్యాంకులు తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అద్దె చెల్లింపులను నిలిపివేయమని RBI అధికారికంగా బ్యాంకులను కోరనప్పటికీ.. పీర్-టు-పీర్ చెల్లింపుల కోసం ఉపయోగించబడుతున్న కార్డుల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు దీన్ని దాటవేస్తుండటంతో ఈ తరహా చెల్లింపులను నిర్వహించే ఫిన్‌టెక్‌లు నియంత్రణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి.


Click it and Unblock the Notifications