ప్రయివేటురంగ దిగ్గజం బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. హౌసింగ్ లోన్ల పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును (RPLR) 10 బేసిస్ పాయింట్లు(0.10 శాతం) తగ్గించింది. ఇది నవంబర్ 10వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. దసరా, దీపావళి పండుగ సమయంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్ మున్ముందు ఆశాజనకంగా ఉండనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని నేషనల్ హౌసింగ్ బ్యాంకు(NHB) తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ గతంలోనే పండుగ ఆఫర్లు ప్రకటించింది.

కస్టమర్లకు ప్రయోజనం
తాజా వడ్డీ రేట్ల కోత నిర్ణయంతో HDFC రిటైల్ హోమ్ లోన్ కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. రిటైల్ హోమ్ లోన్ కస్టమర్లందరికీ ఈ ప్రయోజనం ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు సహా వివిధ బ్యాంకులు హోం లోన్ పైన వడ్డీ రేట్లు తగ్గించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేటు 6.85 శాతం ప్రారంభమవుతుంది. కెనరా బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

బ్యాంకు వరుస ఆఫర్లు
HDFC గత నెలలో ఎన్నారైల కోసం మరో అదిరిపోయే ఆఫర్‌తో ముందుకు వచ్చింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు ఇండియా హోమ్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఆన్‌లై ద్వారా ఈ హోమ్ ఫెయిర్‌ను నిర్వహించింది. అంతకుముందు ఫెస్టివ్ ట్రీట్ పేరుతో పండుగ సమయంలో తమ కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. వివిధ లోన్‌ల నుండి ప్రాసెసింగ్ ఫీజు వరకు తగ్గింపు వరకు ఎన్నో ఆఫర్లు ఇచ్చింది.

పెరిగిన హోమ్ లోన్లు
2020 సెప్టెంబర్ నెలలో HFCల కొత్త హౌసింగ్, నాన్-హౌసింగ్ లోన్‌లు గతంలో కంటే 130 శాతంగా ఉందని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు(HFCs) రెగ్యులేటర్ NHB ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2020 సెప్టెంబర్ నెలలో HFCలు మంజూరు చేసిన హోమ్ లోన్స్ కూడా 105 శాతంగా ఉన్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో ఇటీవల పలు బ్యాంకులు హోమ్ లోన్ల పైన వడ్డీ రేట్లు తగ్గించాయి. హోమ్ లోన్ పంపిణీ అక్టోబర్ నెలలో అంచనాలకు మించి ఉన్నాయని HDFC తెలిపింది. లోన్ అప్రూవల్స్ కూడా 58 శాతం పెరిగాయని, మంజూరైన రుణాలు 35 శాతం పెరిగాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications