భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC Bank తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. యూపీఐ (UPI) ఆధారిత ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్ కు సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కార్డు లేకుండా చేసే యూపీఐ లావాదేవీలను వేరుగా పరిగణించేవారు. కానీ, ఇకపై పరిస్థితి మారబోతోంది.

కొత్త నియమం ఏమిటి?
సాధారణంగా మనం ఏటీఎం కార్డు (Debit Card) ఉపయోగించి డబ్బులు తీస్తే, అవి నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిలో (Free ATM Limits) లెక్కించబడతాయి. అయితే, ఇప్పటివరకు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తీసే నగదును ఈ పరిమితిలోకి చేర్చేవారు కాదు. కానీ, తాజా ప్రకటన ప్రకారం HDFC Bank యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలను కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిలో భాగంగానే పరిగణించనుంది. అంటే మీరు కార్డుతో తీసినా లేదా యూపీఐతో తీసినా.. అన్నీ ఆ ఉచిత లిమిట్ కిందకే వస్తాయి.
ఉచిత పరిమితి దాటితే ఛార్జీలు తప్పవు!
ఒకవేళ మీరు మీ నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే.. సాధారణ ఏటీఎం విత్‌డ్రాయల్ ఫీజులు వర్తిస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది. ప్రస్తుతం HDFC Bank తన సేవింగ్స్ , శాలరీ అకౌంట్ హోల్డర్లకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలను (హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో) అందిస్తోంది. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. టాప్ 6 నగరాల్లో మూడు సార్లు, ఇతర ప్రాంతాల్లో ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి యూపీఐ విత్‌డ్రాయల్‌కు కూడా మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
యూపీఐ ఏటీఎం సౌకర్యం ఎలా పనిచేస్తుంది?
డెబిట్ కార్డు లేకపోయినా నగదు తీసుకోవడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే డైనమిక్ క్యూఆర్ కోడ్‌ను మీ యూపీఐ యాప్ (GPay, PhonePe, Paytm మొదలైనవి) ద్వారా స్కాన్ చేసి, మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా సురక్షితంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్లకు, భౌతిక నగదుకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఈ సౌకర్యాన్ని బ్యాంకులు ప్రవేశపెట్టాయి. అయితే ఫీజుల విషయంలో పారదర్శకత కోసం HDFC Bank ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
బ్యాంకు ఆర్థిక స్థితిగతులు
ఇటీవలే HDFC Bank తన డిసెంబర్ త్రైమాసిక (Q3 FY26) ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 12.17 శాతం పెరిగి మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం (NII) కూడా 6.4 శాతం వృద్ధితో రూ. 32,615 కోట్లకు చేరుకుంది. మార్కెట్ పరంగా చూస్తే, సోమవారం బిఎస్ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రూ. 881.75 వద్ద ముగిశాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ జరగలేదు.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల పట్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని, తమ ఉచిత లావాదేవీల పరిమితిని దృష్టిలో ఉంచుకుని నగదు విత్‌డ్రా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications