దేశీయ ప్రయివేటు రంగ దిగ్గజం HDFC హైదరాబాద్ సహ దేశవ్యాప్తంగా 19 నగరాల్లో మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చింది. కరోనా విజృంభణ, వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్, ఇతర ఆంక్షల నేపథ్యంలో తమ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వ్యాన్ల ద్వారా ఈ మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు శనివారం HDFC బ్యాంకు తెలిపింది. ఈ మొబైల్ ఐటీఎంతో నగదు ఉపసంహరణ కోసం ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. ఈ బ్యాంకు కస్టమర్లకు స్థానికంగానే ఉపసంహరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

15 రకాల ట్రాన్సాక్షన్స్
మొబైల్ ఏటీఎంను ఉపయోగించి కస్టమర్లు 15 రకాల ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఆయా సమయాల్లో పరిమిత కాలం అందుబాటులో ఉంటుంది. ఒక మొబైల్ ఏటీఎం ఒకరోజులో ముూడు నుండి నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో డబ్బులు అవసరమైన వారికి లేదా ఇతర ఏటీఎం సంబంధ అవసరం ఉన్న వారికి మొబైల్ ఏటీఎం ఎంతో ప్రయోజనకరమని గ్రూప్ హెడ్ ఫర్ లయబిలిటీ ప్రోడక్ట్స్ ఎస్ సంపత్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో..
కరోనా నిబంధనలను అనుగుణంగా ఈ ఏటీఎంలను నిర్వహిస్తున్నామని, కస్టమర్లను అనుమతిస్తున్నామని సంపత్ కుమార్ తెలిపారు. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాలలో బ్యాంకు ఈ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఈసారి కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, అలహాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, డెహ్రాడూన్ తదితర సిటీల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

ప్రతిరోజు లక్షల కేసులు
ఇటీవల కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు లాక్ డౌన్, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications