HCLTech News: గట్టిగానే ఉన్న టెక్ దిగ్గజం.. పండక్కి ఇన్వెస్టర్లకు బోనస్ ప్రకటన..
Q3 Results: ఈ వారం దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ ఐటీ సేవల కంపెనీలు ఇప్పటికే తమ క్యూ3 ఫలితాల వెల్లడిని మెుదలుపెట్టాయి.
తాజాగా నోయిడా ఆధారిత టెక్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ మూడవ త్రైమాసిక నికర లాభం 6.23 శాతం పెరిగి రూ.4,351 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,096 కోట్లుగా నమోదైంది. నోయిడాకు చెందిన ఐటీ కంపెనీ మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ.26,960 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.28,816 కోట్లకు పెరిగింది.

శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించబడ్డాయి. అయితే ఇంట్రాడేలో షేరు ధర 3.85 శాతం లాభంతో రూ.1,543 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం రికార్డు తేదీగా జనవరి 20ని కంపెనీ నిర్ణయించింది. అలాగే అర్హులైన షేర్ హోల్డర్లకు సొమ్ము జనవరి 31న అందుతుంది. అలాగే కంపెనీ FY24 గైడెన్స్‌పై కంపెనీ తన ఆదాయ వృద్ధి ఏడాది ప్రాతిపధికన 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది.
కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 19.8 శాతంగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 16 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. గత ఏడాది కంపెనీ పనితీరుపై సీఈవో విజయకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ 18 పెద్ద పెద్ద డీల్‌లను గెలుచుకున్నట్లు పేర్కొంది. వీటిలో ఆరు సర్వీస్ ప్రాజెక్టులు కాగా మిగిలిన 12 సాఫ్ట్‌వేర్ విభాగానికి చెందినవిగా కంపెనీ పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీలో మెుత్తం ఉద్యోగుల సంఖ్య 2,24,756 వద్ద నిలవగా.. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అట్రిషన్ రేటు భారీగా క్షీణించి 12.8 శాతానికి చేరుకున్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications