IT News: ఇండియాలో బెస్ట్ కంపెనీ TCS, ఇన్ఫోసిస్ కాదు.. ఆ సంస్థకే పట్టం కట్టిన టైమ్ మ్యాగజైన్
HCL News: 'భారతీయులకు, కుక్కలకు ప్రవేశం లేదు' అని పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు బోర్డులు పెట్టేవారు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఇండియా లేకపోతే ప్రపంచమే లేదు అన్న స్థాయికి ఎదిగాం. టెక్నాలజీ పరంగా మేము తోపులం అని చెప్పుకునే పలు దేశాలు ఇవాళ భారత్ ముందు తలదించక తప్పని స్థితి ఏర్పడింది. ప్రంపంచ IT రంగంలో ఇండియా కీర్తి పతాకాన్ని మరే ఇతర దేశమూ కనీసం టచ్ కూడా చేయలేదని ఇటీవల పలు విశ్లేషణలు వెలువడ్డాయి. దీనికి మరింత బలం చేకూరుస్తూ.. టైమ్ మ్యాగజైన్ కీలక నివేదిక విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ కంపెనీస్ లిస్ట్‌ను టైమ్ మ్యాగజైన్ తయారు చేసింది. అందులో భారతీయ సంస్థ HCLTech సత్తా చాటింది. అగ్ర దేశాలు అని చెప్పుకుంటున్న పలు దేశాల్లోని సంస్థలను వెనక్కినెడుతూ గ్లోబల్ టాప్ 10 జాబితాలో చోచు దక్కించుకుంది. నోయిడాలో హెడ్ క్వార్టర్స్ కలిగిన ఈ కంపెనీ.. ప్రొఫెషనల్ కేటగిరీలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. అంతేకాకుండా ఇండియాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న సంస్థల్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ మేరకు తన సర్వే వివరాలను టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది.

'HCL సాధించిన ఈ ఘనత మా కంపెనీ శ్రేష్ఠత మరియు ఆవిష్కరణల నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఇది పరిశ్రమలో మా నాయకత్వాన్ని మరియు అగ్రశ్రేణి ఎంప్లాయర్‌గా మా హోదాను బలోపేతం చేస్తుంది' అంటూ HCL హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ అత్యుత్తమ కంపెనీలు 2024 ర్యాంకింగ్ కోసం ఉద్యోగుల్లో సంతృప్తి , ఆదాయ వృద్ధి మరియు స్థిరత్వం వంటి వాటిని పెరామీటర్స్‌గా తీసుకున్నారు. వీటి ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన కంపెనీలను టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. వాటిలో HCL మంచి పనితీరు కనబరిచినట్లు పేర్కొంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ర్యాంక్‌తో సత్కరించింది.
FY25 జూన్ త్రైమాసికంలో హెచ్‌సిఎల్‌టెక్ 4 వేల 257 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 20.45 శాతం పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.6 శాతం అధికంగా 28 వేల కోట్లకు పైగా నమోదైంది. GenAI డైవర్సిఫికేషన్ మరియు బలమైన కార్యాచరణ అమలును దృష్టిలో పెట్టుకుని FY25కిగాను 3-5 శాతం ఆదాయ వృద్ధి సాధించనున్నట్లు అంచనా వేసింది. కాగా జూన్ 2024 నాటికి HCLTech 60 దేశాలలో 2.19 లక్షల మంది ఉద్యోగులకు కలిగి ఉంది.


Click it and Unblock the Notifications