కరోనా నేపథ్యంలో వెసులుబాటు ఉన్న అన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పూర్తిగా తగ్గక పోవడంతో దిగ్గజ కంపెనీలు అన్నీ ఇంటి నుండి పని చేసే సౌకర్యాన్ని వచ్చే ఏడాది వరకు కూడా పొడిగించాయి. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టనప్పటికీ కేసులు తగ్గడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న వాటిలో ఐటీ కంపెనీలే అధికం. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వారానికి ఒకరోజు కార్యాలయానికి రప్పిస్తోంది!

వారంలో ఒకరోజైనా కార్యలయానికి..
కరోనా తీవ్రత కొంత తగ్గడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొన్ని కంపెనీలు 30 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల ఏర్పాటు వంటివి అందుబాటులో ఉంచుతున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు సిద్ధమైంది. వారంలో ఒకరోజు అయినా ఆఫీస్‌లకు రావాలని ఉద్యోగులకు సూచించింది. అయితే ఇది అప్పుడే అమలులోకి రాదు. డిసెంబర్ నుండి పాటిస్తారు. ప్రస్తుతం ఐదు శాతం నుండి ఆరు శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. డిసెంబర్ నాటికి ఇరవై శాతానికి పెంచే ఆలోచన చేస్తోంది.

వీరికి మినహాయింపు..
వారానికి కనీసం ఒకరోజు కార్యాలయానికి రావాలని, ఇది డిసెంబర్ నుండి అమలులోకి వస్తుందని, వారంలో ఒకరోజు లేదా రెండు రోజులు రావాలని ఉద్యోగులను కోరినట్లు చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ (CHRO) వీవీ అప్పారావు అన్నారు. అయితే తాము అందరినీ కార్యాలయాలకు రావాలని కోరడం లేదన్నారు. ఇంట్లో ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నవారు, 50 ఏళ్ల లోపు వృద్ధులు ఉన్నవారు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. అలాగే 50 ఏళ్లు లేదా 55 ఏళ్ల పైబడిన ఉద్యోగులకు కూడా మినహాయింపు ఉందని చెప్పారు. ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే అంశాన్ని దశలవారీగా పెంచుతామని అప్పారావు చెప్పారు.

ఫ్లోర్ మార్షల్స్
కార్యాలయాల్లో హెచ్‌సీఎల్ టెక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక ఉద్యోగికి మరో ఉద్యోగికి మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా కొన్ని కుర్చీలను తొలగించింది. కామన్ రూమ్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ఉద్యోగులకు క్యాబ్ ఏర్పాటు చేశారు. ఫ్లోర్‌మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలో తాము దేనిని వదిలిపెట్టడం లేదని అప్పారావు అన్నారు. ఉద్యోగుల భద్రత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఫుడ్ విషయంలోను జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications