Hurun India Philanthropy: విజయవంతంగా వ్యాపారాలను నిర్వహించటం ఒక ఎత్తైతే.. అందులో వచ్చిన లాభాలు లేదా సంపాదన నుంచి సమాజిక సేవకోసం అందించటం మరో ఎత్తు. చాలా మంది భారతీయ వ్యాపారవేత్తలు దాతృత్వానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సమాజానికి తమ వంతు సాయం అందిస్తుంటారు. వారు ఏడాదికి వివిధ సేవాకార్యక్రమాల కోసం ఎంత ఇస్తున్నారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మెుదటి స్థానంలో..
సాఫ్ట్‌వేర్ దిగ్గజం HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్- 2022 ప్రకారం మెుదటి స్థానంలో నిలిచారు. ఆయన ఏడాదికి రూ.1,161 కోట్లు విరాళంగా అందిస్తున్నారు. అంటే రోజుకు రూ.3 కోట్లు ఛారిటీకి అందిస్తున్నారు. ఇక రెండవ స్థానంలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం ఏడాదికి రూ.484 కోట్లు విరాళంగా అందిస్తున్నారు. అజీమ్ ప్రేమ్‌జీ తన రెండు దాతృత్వ ట్రస్ట్‌లకు గత సంవత్సరం రూ.7,807 కోట్ల విరాళాన్ని అందించారని జాబితా పేర్కొంది.

శివ్ నాడార్ సేవలు..
నాడార్ కుటుంబం డబ్బును విద్యపై వెచ్చిస్తోంది. శివ్ నాడార్ ఫౌండేషన్‌లో SSN ఇన్‌స్టిట్యూషన్స్, విద్యాజ్ఞాన్, శివ్ నాడార్ యూనివర్శిటీ, శివ్ నాడార్ స్కూల్, శిక్షా ఇనిషియేటివ్, కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.

టాప్-10 వ్యాపార వేత్తలు..
ముఖేష్ అంబానీ రూ.411 కోట్లను విద్య, ఆరోగ్య సంరక్షణపై వెచ్చిస్తున్నారు. కుమార్ మంగళం బిర్లా ఆరోగ్య సంరక్షణ, విద్య, స్థిరమైన జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, సామాజిక సంస్కరణలపై రూ.242 కోట్ల విరాళం అందిస్తూ నాల్గవ స్థానంలో ఉన్నారు. సుస్మితా & సుబ్రొటో రూ.213 కోట్లు, రాధా & పార్థసారధి రూ.213 కోట్లు, గౌతమ్ అదానీ రూ.190 కోట్లు, అనిల్ అగర్వాల్ రూ.165 కోట్లు, నందన్ నీలేకర్ రూ.159 కోట్లు, ఏఎమ్ నాయక్ రూ.142 కోట్లను అందిస్తున్నారు.

జెరోధా వ్యవస్థాపకులు..
Zerodha వ్యవస్థాపకులు నితిన్ కామత్ & నిఖిల్ కామత్ వారి విరాళాన్ని 300% పెంచి రూ.100 కోట్లు అందించారు. మహిళల విషయంలో రోహిణి నీలేకని రూ.120 కోట్లు, లీనా గాంధీ తివారీ రూ.21 కోట్లు, అను అగా రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చారు. వీరందరిలో ఎక్కువ మంది విద్యపై ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువగా ఆరోగ్యం రంగంపై కుబేరులు వెచ్చిస్తున్నారు.


Click it and Unblock the Notifications