Hardik Pandya: హార్దిక్-కృనాల్ పాండ్యాలకు షాక్.. కోట్ల రూపాయలు మోసం చేసిన ఆ వ్యక్తి..
Kunal Pandya: ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ జోరు కొనసాగుతోంది. ఎవ్వరి నోట్లో విన్నా క్రికెట్ మ్యాచ్ గురించే వినిపిస్తోంది. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కోట్ల రూపాయల మోసానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది.
పాండ్యా బ్రదర్స్‌ను సొంత సవతి సోదరుడు వైభవ్ పాండ్యా కోట్లాది రూపాయల మేర మోసం చేయటం ప్రస్తుతం సంచలనంగా మారింది. హార్దిక్-కృనాల్‌లను మోసం చేసిన నిందితుడు వైభవ్ పాండ్యాను ముంబైలోని ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. సోదరులిద్దరూ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో తమ తమ జట్లకు ఆడుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. వాస్తవానికి 2021లో నిందితుడు వైభవ్.. పాండ్యా సోదరులతో కలిసి పాలిమర్ వ్యాపారంలో కంపెనీని ప్రారంభించాడు.

ఈ కంపెనీలో హార్దిక్, కృనాల్‌లకు వాటా 40-40 శాతం ఉండగా.. వైభవ్‌కు 20 శాతం భాగస్వామ్యం ఉంది. పార్ట్‌నర్ షిప్ రూల్స్ ప్రకారం.. ఈ కంపెనీ నుంచి వచ్చే లాభాన్ని హార్దిక్, కృనాల్, వైభవ్‌లకు తమ భాగస్వామ్యం వాటా ప్రకారం విభజించాలి. అయితే కంపెనీ లాభాల డబ్బును హార్దిక్- కృనాల్‌లకు ఇవ్వకుండా.. నిందితుడు వైభవ్ పాండ్యా ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసి లాభం మొత్తాన్ని దానికి బదిలీ చేశాడు. దీంతో పాండ్యా సోదరులకు దాదాపు రూ.4.3 కోట్ల నష్టం వాటిల్లింది.
సవతి సోదరుడి మోసం గురించి తెలుసుకున్న పాండ్యా బ్రదర్స్ దీనిపై ఫిర్యాదు చేశారు. నిందితుడిని ఆర్థిక నేరాల విభాగం అరెస్ట్ చేసి 5 రోజుల కస్టడీకి పంపింది. వైభవ్ పాండ్యా తన సోదరులకు తెలియజేయకుండా అదే రంగంలో పనిచేస్తున్న మరొక సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా వ్యాపార ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. ఇలా చేయడం వల్ల సంస్థకు లాభం తగ్గిందని, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని తేలింది. ఇంతలో వైభవ్ పాండ్యా సంస్థలో తన వాటాను 20 శాతం నుంచి 33.3 శాతానికి రహస్యంగా పెంచుకున్నాడు.


Click it and Unblock the Notifications