అమెరికాలో మూడు భారత ఐటీ కంపెనీలకు బిగ్ షాక్.. బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ట్రంప్ ప్రభుత్వానికి సూచన..
అమెరికాలో మూడు భారత ఐటీ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. కిరాయి హ్యాకింగ్ కార్యకలాపాలకు ముసుగుగా పనిచేస్తున్నాయనే ఆరోపణలతో మూడు భారతీయ ఐటీ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ముగ్గురు అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్ ప్రభుత్వాన్ని కోరినట్లు రాయిటర్స్ నివేదించింది.
బెల్‌ట్రాక్స్, సైబర్‌రూట్, గతంలో అప్పిన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌గా పిలువబడిన సన్‌కిస్డ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు వాటి అనుబంధ సంస్థలు అమెరికా పౌరులు, వ్యాపారాలు, న్యాయవాదులపై దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా లక్ష్యంగా చేసుకుని గూఢచర్యానికి పాల్పడుతున్నాయని డెమోక్రటిక్ సెనేటర్లు రాన్ వైడెన్, షెల్డన్ వైట్‌హౌస్, రిపబ్లికన్ ప్రతినిధి పాట్ హారిగాన్ ఆరోపించారు.

ఈ కంపెనీలను తక్షణమే యుఎస్ వాణిజ్య విభాగపు 'ఎంటిటీ జాబితా'లో చేర్చాలని వారు లేఖ రాశారు. ఒకవేళ ఈ సంస్థలను ఎంటిటీ జాబితాలో చేర్చితే.. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్‌సెక్యూరిటీ సాంకేతిక సాధనాలు సదరు కంపెనీలకు లభించకుండా తీవ్ర ఆంక్షలు అమలులోకి వస్తాయి.
న్యాయపరమైన, వ్యాపార వివాదాల సమయంలో ప్రత్యర్థుల సమాచారాన్ని దొంగిలించడానికి పాశ్చాత్య దేశాలకు చెందిన న్యాయవాదులు, ప్రైవేట్ పరిశోధకులు ఉపయోగించుకున్న సైబర్ కిరాయి పరిశ్రమలో బెల్‌ట్రాక్స్, సైబర్‌రూట్ అత్యంత కీలక పాత్ర పోషించినట్లు గతంలో రాయిటర్స్ జరిపిన దర్యాప్తులో బయటపడింది.
అలాగే అప్పిన్ టెక్నాలజీస్ ప్రారంభంలో ఒక విద్యా సంస్థగా మొదలై.. కాలక్రమేణా కార్పొరేట్ కార్యనిర్వాహకులు, రాజకీయ నాయకులు, సైనిక అధికారులు, పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకునే సైబర్ హ్యాకింగ్ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెందిందని కథనాలు వెలువడ్డాయి. ది న్యూయార్క్, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్ కూడా తమ అంతర్గత నివేదికలలో ఈ మూడు భారతీయ సంస్థలకు సైబర్ దాడులు, డిజిటల్ గూఢచర్యంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశాయి.
అయితే ఈ ఆరోపణలను సదరు మూడు కంపెనీల నిర్వాహకులు తీవ్రంగా ఖండించారు. తాము ఎలాంటి చట్టవిరుద్ధమైన హ్యాకింగ్ లేదా గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడలేదని, తమపై వస్తున్న వార్తలు వాస్తవదూరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా చట్టసభ సభ్యులు పంపిన ఈ అభ్యర్థన యుఎస్ వాణిజ్య శాఖ పరిశీలన పరిధిలోకి వెళ్లడంతో, ఆ శాఖ ఈ సంస్థల కార్యకలాపాలను సమగ్రంగా విచారించి ఎంటిటీ లిస్ట్‌లో చేర్చాలా వద్దా అనే దానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
