ఇక అమెరికన్లకు ఎక్కువ వేతనాలు! మన ఐటీ కంపెనీలపై ప్రభావం, ముందు జాగ్రత్తతో...
అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు జారీ చేయకూడదని ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి బుధవారం (జూన్ 24) నుండే అమల్లోకి వస్తాయి. త్వరలో ఎన్నికలు ఎదుర్కోనున్న ట్రంప్ స్థానికులను ఆకట్టుకునేందుకు ఈ ఉత్తర్వులు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆయన నిర్ణయంపై టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజా ఉత్తర్వులపై అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులపై, మన దేశ ఐటీ నిపుణులపై పడుతుంది. ఈ వీసాల రద్ద వల్ల మన ఐటీ కంపెనీల లాభాలకు గండిపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ వేతనంతో స్థానికులు.. మార్జిన్లపై ప్రభావం
హెచ్1బీతో సహా ఇతర వర్క్ వీసాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందికరమే అంటున్నారు. ఈ నిర్ణయంతో భారత ఐటీ నిపుణుల్ని ఈ ఏడాది చివరి వరకు వర్క్ వీసాలపై అమెరికా పంపించే అవకాశాలు మూసుకుపోయినట్లే. అయితే మన ఐటీ కంపెనీలు స్థానికులకు ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కొంతలో కొంత ఊరట కలిగించవచ్చు. అయినప్పటికీ అదనపు ఉద్యోగులు అవసరమైతే ఎక్కువ వేతనాలు ఇచ్చి మరికొంతమంది స్థానికులను నియమించుకోకతప్పని పరిస్థితి. దీంతో ఖర్చులు పెరిగి కంపెనీల లాభాలకు గండిపడుతుందని అంచనా.

ఆ కంపెనీలపై మరింత ప్రభావం
ఇండియా ఐటీ సంస్థల లాభాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపిస్తుందని, అమెరికాలో ఉద్యోగులు తక్కువగా ఉన్న కంపెనీలపై మరింత ఎక్కువ ప్రభావం ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. 2017 నుండి భారత ఐటీ కంపెనీలు హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయని, అమెరికాలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించి స్థానికులను చేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది.

ఇండియన్, అమెరికన్ కంపెనీలకు ఇబ్బందులు
అమెరికాలో భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే భారీ స్థాయిలో స్థానిక ఉద్యోగులను నియమించుకొంటున్నాయని, ఆ దేశంలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని, కానీ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2021 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాలు పొందిన అనేక అమెరికన్, ఇండియన్ కంపెనీలకు ప్రభుత్వం నిర్ణయంతో ఇబ్బందులు తప్పవంటున్నారు.

కంపెనీల ముందు జాగ్రత్త
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2017 నుండి అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ జాగ్రత్త పడుతున్నాయి. అమెరికాలోని టీసీఎస్‌లో ఇప్పటికే 20,000 మంది అమెరికన్ ఉద్యోగులు ఉన్నాయి. ఇన్ఫోసిస్‌లో ఇప్పుడు ఉన్నవారికి తోడు 10,000 మందిని తీసుకోనుంది. ప్రస్తుతం అమెరికాలోని భారత ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో 40 శాతం నుండి 70 శాతం మంది స్థానికులు ఉన్నారు.

మన నిపుణులకు నష్టమే
అమెరికా ప్రతి సంవత్సరం 85,000 హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంది. ఇందులో దాదాపు 70 శాతం మన దేశం వారే ఉంటారు. అమెరికాలో కార్యకలాపాలు మన ఐటీ కంపెనీలు, అమెరికా కంపెనీలు.. వేతనాల ఖర్చులు తగ్గించుకునేందుకు భారత ఉద్యోగులను హెచ్1బీ వీసాలపై అమెరికా రప్పించుకుంటాయి. ఇప్పుడు ఎక్కువ వేతనాలతో స్థానికులను నియమించుకోవడం అంటే ఐటీ కంపెనీల లాభాలపై ప్రభావం ఉంటుంది.


Click it and Unblock the Notifications