హెచ్1బీ వీసా: ట్రంప్ షాక్.. కోర్టు తీర్పుతో టెక్కీలకు ఊరట.. కానీ!
అమెరికాలోని టెక్ కంపెనీలు, విదేశాల నుంచి నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్1బీ వీసాలపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఈ వీసాలను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నది భారతీయులే.
హెచ్1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న వారిలో 70% మంది భారతీయ టెక్ ఉద్యోగులే. ప్రస్తుత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నుంచి మొదలుకొని, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలలో కీలక పదవుల్లో ఉన్న ఎంతోమంది భారతీయులు హెచ్1బీ వీసా ద్వారానే అక్కడికి వెళ్లారు. అయితే, ఈ వీసాను అడ్డం పెట్టుకుని అమెరికన్ కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకుంటున్నాయని అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్రంగా ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే, కొత్తగా హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు 1 లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ ట్రంప్ గతేడాది ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. దీంతో టెక్ కంపెనీలకు విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఫలితంగా, చాలా కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి వెనకడుగు వేశాయి. ఈ పరిణామంతో భారత ఐటీ ఉద్యోగులు, టెక్కీల అమెరికా కల చెదిరిపోయిందని భావించారు.
ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే కొత్త హెచ్1బీ వీసాలపై ట్రంప్ విధించిన 1 లక్ష డాలర్ల ఫీజు చెల్లదని, అది చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ట్రంప్ ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు (కాంగ్రెస్‌కు) మాత్రమే ఉందని, ఈ నిర్ణయం ఆ హక్కును హరించడమేనని కోర్టు అభిప్రాయపడింది.
"వీసా జారీ కోసం ఏ పేరుతో ఫీజు వసూలు చేసినా, దాని స్వభావం పన్ను కిందకే వస్తుంది" అని తీర్పు వెలువరించిన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుతో, భారత ఐటీ ఉద్యోగులు, టెక్కీలు హెచ్1బీ వీసాతో అమెరికా వెళ్లి ఉద్యోగం చేయడం మళ్లీ సులభతరం కానుంది. టెక్ కంపెనీలకు కూడా ఇది శుభవార్తే.
ఇదిలా ఉండగా, ఈ తీర్పుపై వైట్‌హౌస్ స్పందించింది. "అమెరికన్ టెక్ కంపెనీలు చాలా ఏళ్లుగా హెచ్1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ సమస్యను సరిదిద్దడానికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫీజును ప్రకటించారు. కోర్టు తీర్పుపై అమెరికా ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుంది" అని ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications
