హెచ్1బీ వీసా: అమెరికాలో ఉద్యోగం పోతే ఇక అంతేనా?
అమెరికాలో ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసాపై వరుసగా కఠిన నిబంధనలు పెడుతూ భారత ఐటీ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమెరికా వెళ్లడానికి హెచ్1బీ వీసా దొరకడమే గగనంగా మారిన పరిస్థితుల్లో, ఇప్పటికే ఈ వీసాపై అక్కడ ఉంటున్న టెకీలకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది.
అమెరికా టెక్ కంపెనీలు ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్1బీ వీసాపైనే ఆధారపడతాయి. ఈ వీసాలను వినియోగించుకుంటున్న వారిలో 70% మంది భారత ఐటీ నిపుణులే. అందుకే హెచ్1బీ వీసా నిబంధనల్లో ఏ చిన్న మార్పు వచ్చినా అది మన టెకీలపైనే భారీ ప్రభావం చూపుతుంది.
తాజాగా, హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు, ఒక ముఖ్యమైన రక్షణ కవచంలా ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రస్తుత వీసా నిబంధనల్లో ఒక కొత్త మార్పు తీసుకురావడంపై చర్చిస్తోంది. దీని ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉంది. ఇది ఇంకా చట్టంగా మారలేదు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, హెచ్1బీ వీసా హోల్డర్లు ఉద్యోగం కోల్పోతే వెంటనే అమెరికా విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు. వారికి 60 రోజుల సమయం లభిస్తుంది. ఈ కాలంలో వారు కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చు, ఉద్యోగం మారినట్లు పత్రాలు సమర్పించవచ్చు లేదా చట్టబద్ధంగా దేశం విడిచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు.
ఒకవేళ ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, హెచ్1బీ వీసా ఉన్నవారికి ఉద్యోగం పోగానే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్పు కేవలం హెచ్1బీ వీసా హోల్డర్లకే కాదు, E-1, E-2, E-3, H-1B1, L-1, O-1 వీసాలు ఉన్నవారికి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవు.
అమెరికా టెక్ రంగంలో అకస్మాత్తుగా ఉద్యోగాలు పోయినప్పుడు, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఈ 60 రోజుల సమయం చాలా కీలకం. ఈ గ్రేస్ పీరియడ్ లేకపోతే, ఉద్యోగం కోల్పోయిన మరుక్షణమే వారి అమెరికా కల చెదిరిపోయే ప్రమాదం ఉంది. ఏళ్ల తరబడి అమెరికాలో పనిచేస్తూ, అక్కడ ఇల్లు, పిల్లల చదువులు, ఇతర ఆర్థిక బాధ్యతలు ఉన్న భారతీయులకు, వెంటనే దేశం విడిచి వెళ్లాలనే ఒత్తిడి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.
ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ లేకపోతే, చట్టబద్ధంగా అమెరికాలో ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడం లేదా వీసా స్టేటస్ మార్చుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అయితే, ఈ మార్పుపై ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షించిన తర్వాతే తుది నిబంధనను అమలు చేస్తారు.


Click it and Unblock the Notifications