హెచ్-1బి వీసా హోల్డర్లకు బిగ్ షాక్..అమెరికాలో ఉద్యోగం పోతే వెంటనే దేశం విడిచిపోవాల్సిందే..
అమెరికాలో హెచ్-1బి (H-1B) వంటి తాత్కాలిక వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న విదేశీ నిపుణులకు భవిష్యత్తులో తీవ్ర నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయిన విదేశీ కార్మికులకు లభించే 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' (Grace Period) రక్షణ నిబంధనను తొలగించే ప్రతిపాదనపై అమెరికా వైట్ హౌస్ తన ప్రాథమిక సమీక్షను పూర్తి చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) రూపొందించిన ఈ ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (OMB) పరిశీలించింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఉద్యోగం ఊడిన మరుక్షణమే నిపుణులు అమెరికాను విడిచివెళ్లాల్సిన క్లిష్టమైన పరిస్థితులు నెలకొంటాయి.
ఏమిటీ 60 రోజుల గ్రేస్ పీరియడ్?
2017లో ప్రవేశపెట్టిన ఈ నిబంధన ప్రకారం.. హెచ్-1బి (H-1B), ఎల్-1 (L-1), ఓ-1 (O-1), ఇ-1, ఇ-2, ఇ-3, టిఎన్ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు అకస్మాత్తుగా లేఆఫ్స్ లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోతే.. అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ మరొక స్పాన్సర్ చేసే కొత్త యజమానిని వెతుక్కునేందుకు 60 రోజుల సమయం లభిస్తుంది. అయితే, ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం ఈ 60 రోజుల స్వయంచాలక గడువును రద్దు చేస్తే, ఐటి, కన్సల్టింగ్ రంగాల్లో పనిచేసే వందలాది మంది విదేశీ నిపుణులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వలస నిబంధనల ప్రకారం మరొక చట్టబద్ధ వీసా హోదా లేకుంటే, ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడిచివెళ్లాల్సి ఉంటుంది.

వైట్ హౌస్ పరిశీలించిన ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా లాభపడేది, దెబ్బతినేది భారతీయ నిపుణులే. 2024 ఆర్థిక సంవత్సరంలో నమోదైన హెచ్-1బి దరఖాస్తుల్లో సుమారు 71 శాతం భారతీయ టెక్కీలవే కావడం గమనార్హం. ఉద్యోగాన్ని కోల్పోవడం వల్ల కేవలం ఉద్యోగి మాత్రమే కాక వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామి, పిల్లలు (H-4 వీసాదారులు) కూడా తక్షణ ఇమ్మిగ్రేషన్ సంక్షోభంలో కూరుకుపోతారు. ఎలాంటి గడువు లేకపోతే ఇళ్ల లీజు రద్దు చేసుకోవడం, పిల్లల పాఠశాలల నుంచి విద్యార్థుల వెనక్కితీత, వ్యక్తిగత ఆస్తుల సర్దుబాటు మరియు విమాన ప్రయాణ ఏర్పాట్లకు కనీస సమయం దొరకదని నిపుణులు వాపోతున్నారు.
ఈ నిర్ణయంపై మాజీ వైట్ హౌస్ సలహాదారు అజయ్ జైన్ భూటోరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించడం అమానుషమని, దాన్ని ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులకు 60 రోజులు కూడా చాలవని.. ఈ గడువును రద్దు చేయడానికి బదులుగా 180 రోజులకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ ప్రతిపాదనపై సమీక్ష పూర్తయినప్పటికీ.. నిబంధన ఇంకా అధికారికంగా అమలులోకి రాలేదు. ఈ ప్రతిపాదనను త్వరలోనే ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించనున్నారు. ఆ తర్వాత సుమారు 30 నుండి 60 రోజుల పాటు పబ్లిక్ కామెంట్స్ (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రక్రియ నడుస్తుంది. మార్కెట్ వర్గాలు, వివిధ పరిశ్రమలు మరియు చట్టసభల నుండి వచ్చే అభిప్రాయాల ఆధారంగా అమెరికా ప్రభుత్వం ఈ నిబంధనలో మార్పులు చేయడం లేదా ఉపసంహరించుకోవడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, ప్రతిపాదన అధికారికంగా ఖరారయ్యే వరకు హెచ్-1బి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగనుంది.


Click it and Unblock the Notifications
