ట్రంప్ సర్కార్ బిగ్ షాక్.. H-1B వీసాలతో అమెరికన్లను రీప్లేస్ చేయొద్దు.. కార్పొరేట్ కంపెనీలకు వార్నింగ్..
అమెరికాలో విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్-1బి (H-1B) వీసా వ్యవస్థపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కార్పొరేట్ కంపెనీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చౌకైన విదేశీ కార్మికులను నియమించుకోవడానికి అమెరికన్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అమెరికన్ల ఉద్యోగ భద్రతను కాపాడేందుకు వైట్ హౌస్ చేపడుతున్న చర్యలకు సంబంధించిన ఒక నివేదికను పంచుకుంటూ, ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో ఎంత కఠినంగా ఉందో ఆయన పునరుద్ఘాటించారు.
గతంలో హెచ్-1బి వీసాలను స్పాన్సర్ చేసే కంపెనీలు తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగుల కోసం, సమాన నైపుణ్యాలున్న స్థానిక అమెరికన్లను తొలగించిన ఘటనలపై అమెరికా ప్రభుత్వం ప్రత్యేక దృష్ట్యా ఉంచింది. ఈ మేరకు జారీ చేసిన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం, కంపెనీల నియామకాల చరిత్రను మరియు లేఆఫ్స్ రికార్డులను కార్మిక శాఖ క్షుణ్ణంగా తనిఖీ చేయనుంది. "అమెరికన్లను తీసివేసి చౌక విదేశీ శ్రామికులను తెచ్చుకుంటే ల్యాబర్ డిపార్ట్‌మెంట్ తలుపు తడుతుంది" అని కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి'ఎస్పోసిటో కూడా హెచ్చరించారు.

హెచ్-1బి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే పలు సంచలనాత్మక మార్పులను తీసుకొచ్చింది. హెచ్-1బి వీసా దరఖాస్తులపై $100,000 (సుమారు ₹83 లక్షలు) భారీ రుసుము విధించే నిబంధనను స్థానిక కోర్టు రద్దు చేసినప్పటికీ, ప్రభుత్వం దానిని మళ్లీ పునరుద్ధరించింది. దానికి అదనంగా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) మరో $103,265 రుసుమును ప్రతిపాదించి, కంపెనీలకు వీసా స్పాన్సర్‌షిప్‌ను అత్యంత ఖరీదైనదిగా మార్చింది. దీనికి తోడు, ఇప్పటివరకు ఉన్న యాదృచ్ఛిక (లక్కీ డ్రా/రాండమ్) లాటరీ విధానాన్ని రద్దు చేసి, అత్యధిక వేతనం మరియు నైపుణ్యం ఉన్న దరఖాస్తుదారులకే ప్రాధాన్యం ఇచ్చే 'వేతన ఆధారిత లాటరీ' విధానాన్ని ప్రవేశపెట్టారు.
వైట్ హౌస్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ కొత్త నిబంధనలకు ముందు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 6.1% నుండి 7.5% వరకు పెరిగింది. ఇది ఆర్ట్స్ లేదా బయాలజీ చదివిన వారికంటే రెట్టింపు కంటే ఎక్కువ. అయితే 2025లో ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన నిర్ణయాల వల్ల ఐటీ అవుట్‌సోర్సింగ్ దిగ్గజాలు దాఖలు చేసే హెచ్-1బి రిజిస్ట్రేషన్లు ఏకంగా 92 శాతం మేర పడిపోయాయి. కాన్సులర్ ప్రాసెసింగ్ అభ్యర్థనలు 97 శాతం తగ్గడంతో, తక్కువ జీతాలకు పనిచేసే ఒప్పంద కార్మికుల స్థానంలో అధిక వేతనాలు పొందే ప్రతిభావంతులకు మాత్రమే అమెరికాలో అవకాశాలు దక్కుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

