H-1B వీసాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్..నిలిచిపోయిన గ్రీన్ కార్డు ప్రాసెస్ రీస్టార్ట్
అమెరికాలో H-1B తదితర వర్క్ వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది గూగుల్ ఉద్యోగులకు శుభవార్త. గత రెండేళ్లుగా నిలిపివేసిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రక్రియను 2026 నుంచి పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభించాలని గూగుల్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా, గ్రీన్ కార్డ్‌కు కీలకమైన PERM (Program Electronic Review Management) ప్రక్రియను వేగవంతం చేసేందుకు కంపెనీ అంతర్గతంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ ప్రక్రియలో PERM కీలక దశగా ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆయా కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టంగా తెలియజేయాలి. అంటే, సంబంధిత ఉద్యోగానికి తగిన అర్హత కలిగిన అమెరికన్ నిపుణులు అందుబాటులో లేరని, అలాగే విదేశీ ఉద్యోగులను నియమించడం వల్ల స్థానిక ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉండబోదని నిరూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు నెరవేర్చిన తర్వాతే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌కు మార్గం సుగమమవుతుంది.

గూగుల్ ఈ PERM ప్రక్రియను 2023 జనవరిలో నిలిపివేసింది. అదే సమయంలో కంపెనీ సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. అప్పట్లో అమెజాన్, మెటా వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా పెద్ద ఎత్తున లేఆఫ్స్‌కు వెళ్లాయి. అమెరికన్ ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో.. PERM నిబంధనల ప్రకారం స్థానిక ప్రతిభ అందుబాటులో లేదని నిరూపించడం కంపెనీలకు కష్టంగా మారింది. దీంతో విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడటంతో.. 2026లో ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని గూగుల్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం భారతీయ టెక్ నిపుణులకు ఊరట కలిగించే అంశంగా మారింది. సాధారణంగా అమెరికాలో టెక్ కంపెనీలు తమ వద్ద H-1B వంటి తాత్కాలిక వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ పొందేందుకు PERM ద్వారానే సహాయం చేస్తుంటాయి. అందువల్ల ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడం అనేక మంది టెక్కీలకు భవిష్యత్ భద్రతను కల్పించనుంది.
2026 మొదటి త్రైమాసికం నుంచే PERMకు అర్హత పొందిన ఉద్యోగులను గూగుల్ సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గూగుల్ అంతర్గత కమ్యూనికేషన్లకు సంబంధించిన మెమోలు లీక్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం.
గూగుల్‌లో వీసాలపై పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఈ ప్రక్రియకు అర్హుడు కాదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కొన్ని కీలక షరతులు విధించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకే PERM అర్హత ఉంటుందని, రిమోట్‌గా పని చేస్తున్న వారు ఈ ప్రక్రియలోకి రావాలంటే కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుందని మెమోలో పేర్కొంది. అలాగే లెవల్-3 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులను ఈ దశలో చేర్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు ప్రమాణాలు, మోడరేట్ ఇంపాక్ట్ వంటి అంశాలు కూడా కీలకంగా పరిగణించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications