హెచ్-1బీ వీసా ఫీజుపై కీలక అప్‌డేట్.. వారు రూ. 80 లక్షలు కట్టనవసరం లేదు.. మరి ఎవరు చెల్లించాలంటే..
అమెరికా ప్రభుత్వం తన H-1B వీసా విధానాన్ని మరోసారి సవరించింది. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులు, విదేశీ విద్యార్థులకు పెద్ద ఉపశమనం లభించనుంది. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా కోసం రుసుమును $1,00,000 (సుమారు రూ. 83 లక్షలు) వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే భయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) విడుదల చేసిన మార్గదర్శకాలు పెంచిన రుసుము అందరికీ వర్తించదని స్పష్టం చేశాయి.
ఎవరికి రుసుము మినహాయింపు లభిస్తుంది?: USCIS ప్రకారం.. ఈ కొత్త రుసుము కేవలం అమెరికా వెలుపల నుండి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న లేదా పనిచేస్తున్న విదేశీయులు, ముఖ్యంగా F-1 విద్యార్థి వీసా హోల్డర్లు, L-1 కంపెనీ బదిలీదారులు, ఇప్పటికే ఉన్న H-1B వీసా హోల్డర్లు, పొడిగింపులు లేదా పునరుద్ధరణ కోరేవారు ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకొక ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. H-1B వీసా కోసం అమెరికా లోపల నుంచే దరఖాస్తు చేసే విద్యార్థులు లేదా ఉద్యోగులు కూడా ఈ భారీ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతారు.

దేశం వెలుపల నుండి వచ్చే వారికి మాత్రమే కొత్త రుసుము: అమెరికా వెలుపల నుండి కొత్తగా ఉద్యోగం కోసం H-1B వీసా దరఖాస్తు చేసుకునే వారు మాత్రం $100,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఈ రుసుము ఒకేసారి చెల్లించాలి. దరఖాస్తు తిరస్కరించబడినా డబ్బు తిరిగి ఇవ్వబడదని USCIS పేర్కొంది.సెప్టెంబర్ 21, 2025కి ముందు దాఖలైన అన్ని దరఖాస్తులు పాత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని తెలిపింది. అంటే, ఆ తేదీకి ముందు ఆమోదం పొందిన H-1B వీసాదారులు కొత్త రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
అమెరికా జాతీయ ప్రయోజనాల ప్రమాణాలు: ఫీజు మినహాయింపు కోసం కంపెనీలు లేదా సంస్థలు తమ ఉద్యోగి అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఎంతగా దోహదపడతాడో వివరించే అధికారిక లేఖ సమర్పించాలి.అదేవిధంగా, ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలు కలిగిన వ్యక్తి అమెరికాలో లేడని కూడా నిరూపించాలి. ఇలాంటి ప్రమాణాలు ఉంటేనే ఆ సంస్థలు ఫీజు మినహాయింపు పొందగలవు.
H-1B వీసా భారతీయ IT పరిశ్రమకు వెన్నెముకగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ టెక్ నిపుణులు ఈ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ సవరణ వల్ల, అమెరికాలో ఇప్పటికే చదువుతున్న లేదా పనిచేస్తున్న భారతీయ విద్యార్థులు, నిపుణులు భారీ ఆర్థిక భారాన్ని తప్పించుకోగలుగుతారు. ఈ కొత్త మార్గదర్శకాలు H-1B వీసా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ, భారతీయ ఉద్యోగులకు స్థిరత్వం కలిగిస్తున్నాయి. అమెరికాలో తమ కెరీర్‌ను కొనసాగించాలనుకునే భారతీయులకు ఇది పెద్ద ఊరట కలిగించే నిర్ణయంగా మారింది.


Click it and Unblock the Notifications