అమెరికాలో ఉద్యోగం మరిచిపోండి.. H-1B వీసా ఫీజును మళ్లీ భారీగా పెంచిన ట్రంప్ సర్కారు..
అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయిపోవాలనే వారికి ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. గతంలోనే H-1B పైలక్ష డాలర్ల ఫీజుతో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా.. ఈ సారి ఆ ఫీజును పెంచుతూ మరో షాకిచ్చింది. తాజాగా అమెరికాలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ సిబ్బందికి అందించే హెచ్-1బి (H-1B) వీసా రుసుమును ఏకంగా ఒక లక్ష డాలర్లకు పైగా పెంచి.. దానిని శాశ్వతం చేయాలని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది.
ఈ మేరకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) జారీ చేసిన తాజా ముసాయిదా నిబంధనలు అంతర్జాతీయ ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతంలో విధించిన తాత్కాలిక రుసుము గడువు ముగియనున్న నేపథ్యంలో, ఈ పెంచిన ఖర్చును చట్టబద్ధంగా శాశ్వతం చేసేందుకు ట్రంప్ పరిపాలన ప్రయత్నిస్తోంది.

ఈ రుసుము పెంపుపై ఇప్పటికే అమెరికా న్యాయస్థానాల్లో తీవ్ర విచారణ జరుగుతోంది. గతంలో ప్రభుత్వం విధించిన వంద వేల డాలర్ల తాత్కాలిక రుసుమును కాంగ్రెస్ ఆమోదించని చట్టవిరుద్ధమైన పన్నుగా అభివర్ణిస్తూ బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినప్పటికీ, ఈ న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్న తరుణంలోనే డీహెచ్‌ఎస్ ఈ కొత్త శాశ్వత నిబంధనను తెరపైకి తెచ్చింది. ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన ఈ నిబంధన ప్రక్రియ పూర్తయితే.. హెచ్-1బి వీసా రుసుము ఒక్కసారిగా 1,03,265 డాలర్లకు చేరి స్థిరపడనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాధారణంగా అమెరికాలో టెక్నాలజీ, విద్య, పరిశోధన రంగాలు విదేశీ నిపుణులపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రతీ ఏటా 65,000 సాధారణ వీసాలతో పాటు, ఉన్నత విద్యార్హతలు కలిగిన వారి కోసం మరో 20,000 వీసాలను అమెరికా యజమానులకు కేటాయిస్తారు. గతంలో ఈ వీసాల కోసం సాధారణ రుసుములు రెండు వేల నుండి ఐదు వేల డాలర్ల మధ్య మాత్రమే ఉండేవి. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఖర్చు భారీగా పెరగనుంది. కోర్టులో దాఖలైన ఆధారాల ప్రకారం.. ఫిబ్రవరి నాటికే దాదాపు 70 మంది అమెరికన్ యజమానులు సుమారు 85 వీసా దరఖాస్తుల కోసం ఈ భారీ రుసుమును చెల్లించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
అయితే ఈ పెంపు వర్తించే విధానంపై నివేదికల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికే విద్యార్థి వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ పౌరులకు లేదా ప్రస్తుత వీసాల పునరుద్ధరణలకు ఈ రుసుము వర్తించదని కొన్ని ప్రాథమిక ప్రకటనలు చెబుతున్నప్పటికీ.. డీహెచ్‌ఎస్ జారీ చేసిన తాజా నూతన ప్రతిపాదనల ప్రకారం వార్షిక పరిమితి కింద వచ్చే కొత్త పిటిషన్లన్నింటికీ ఈ భారీ ఫీజు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ పెంచిన రుసుము ప్రతిపాదన ప్రస్తుతం ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రజాభిప్రాయ సమీక్ష దశలోనే ఉంది. కోర్టుల సవాళ్లు, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యే వరకు ఇది తక్షణమే అమల్లోకి రాదని వలస రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ విధానం గనుక పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, అమెరికాలో ఉద్యోగం సాధించాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల కలలపై ఇది కోలుకోలేని దెబ్బ తీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications
