అమెరికాలో మీ పెత్తనమేంది.. దొబ్బేయండిక..భారత టెకీలపై అరిజోనా సీఈఓ ఫిష్‌బ్యాక్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల అమెరికా వ్యాపార రంగంలో H-1B visa మీద పెద్ద చర్చకు తెరలేచింది. పెట్టుబడి సంస్థ అరిజోనా CEO, అమెరికా ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) మాజీ కీలక అధికారి జేమ్స్ ఫిష్‌బ్యాక్ ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు H-1B వీసా వ్యవస్థపై తీవ్ర విమర్శలను రేకెత్తించాయి. ఫిష్‌బ్యాక్ ఈ ప్రోగ్రామ్‌ను H-1B వీసా స్కామ్ అని పిలుస్తూ.. అమెరికన్ కంపెనీలు విదేశీ కార్మికులను ముఖ్యంగా భారతీయులను ఉపయోగించి తమ స్వదేశీ ఉద్యోగులను అణగదొక్కుతున్నాయని ఆరోపించారు.
జేమ్స్ ఫిష్‌బ్యాక్ అక్టోబర్ 26న తన X (మునుపటి ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ.. అమెరికన్ కంపెనీలు ఈ ఉద్యోగాలకు అమెరికన్లను కనుగొనలేమంటూ పదే పదే చెబుతున్నాయి.కానీ నిజం ఏమిటంటే, వారు అమెరికన్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి కూడా సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఫిష్‌బ్యాక్ ప్రకారం చాలా కంపెనీలు ఉద్యోగ ప్రకటనలను అస్పష్టంగా లేదా కనబడని పద్ధతిలో ప్రచురించి, అమెరికన్ అభ్యర్థులు దరఖాస్తు చేయకుండా చూస్తున్నాయి.
ఆ తర్వాత ఎవరూ అప్లై చేయలేదనే పేరుతో విదేశీ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఫలితంగా, అర్హత కలిగిన అమెరికన్‌లకు ఉద్యోగ అవకాశాలు దూరమవుతున్నాయి, జీతాలు తగ్గుతున్నాయి. వారి గౌరవం కూడా దెబ్బతింటోందన్నారు.ఇది చాలా అవమానకరమైనది. ఈ H-1B వీసా మోసాన్ని ఇప్పుడు పూర్తిగా కూల్చివేయాల్సిన సమయం వచ్చిందని ఆయన గట్టిగా పేర్కొన్నారు.

ఫిష్‌బ్యాక్ ప్రధానంగా భారతీయ ఇంజనీర్లు, టెక్ వర్కర్లపైను టార్గెట్ చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం అమెరికా కంపెనీలు చవకైన కార్మికుల కోసం భారతదేశాన్ని ఆశ్రయిస్తున్నాయి.ఇండియా నుండి చౌకైన కార్మికులను తీసుకువచ్చి అర్హత కలిగిన అమెరికన్లను భర్తీ చేయడం ద్వారా కంపెనీలు మెరుగుపడడం లేదు. వారు తమ పౌరులను పక్కనబెడుతున్నారని ఆయన అన్నారు. భారతీయులు, చైనీయులు తాము మెరుగ్గా ఉన్నామని అనుకుంటారు. కానీ వారు కూడా ఈ వ్యవస్థలో దోపిడీకి గురవుతున్నారు. అయినప్పటికీ, నాకు వారి పట్ల సానుభూతి లేదు, ఎందుకంటే వారు అమెరికన్లను రెండవ తరగతి పౌరులుగా చూడడంలో భాగస్వాములని ఆయన స్పష్టం చేశారు.
ఫిష్‌బ్యాక్ వ్యాఖ్యలు ట్రంప్ పరిపాలన H-1B వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల వరకు పెంచిన కొద్ది రోజులకే వచ్చాయి. ఈ ప్రోగ్రామ్ కింద సంవత్సరానికి 65 వేల వీసాలు జారీ అవుతాయి. వీటిలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయులు ఉంటారు. ముఖ్యంగా టెక్ కంపెనీలు (TCS, Infosys, Wipro, Cognizant వంటి సంస్థలు) ఈ వీసాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
ఫిష్‌బ్యాక్ కేవలం H-1B వీసా వ్యతిరేకతతో ఆగలేదు. ఆయన మొత్తం వలస వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కోరారు. చట్టబద్ధమైన వలసలకైనా నేను మద్దతు ఇవ్వను. అమెరికాను ప్రత్యేకంగా చేసేది మన దేశంలో ఇప్పటికే ఉన్న ప్రతిభ, ధైర్యం, సామర్థ్మని ఆయన అన్నారు. అమెరికాలో లక్షలాది మంది పౌరులు తక్కువ జీతాలతో లేదా నిరుద్యోగ స్థితిలో ఉన్నారని, వారికి మొదట అవకాశాలు ఇవ్వాలని ఆయన సూచించారు. మనం మన దేశ ప్రజలకే అవకాశాలు ఇవ్వకపోతే, వలసల ద్వారా వచ్చే వారికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశ్నించారు.
జేమ్స్ ఫిష్‌బ్యాక్ వ్యాఖ్యలు అమెరికాలో H-1B వీసా వ్యవస్థ,భారతీయ IT కార్మికులు, వలస విధానాలపై మళ్లీ పెద్ద చర్చను వెలుగులోకి తెచ్చాయి. ఒకవైపు అమెరికన్ సంస్థలు విదేశీ ప్రతిభ అవసరమని చెబుతుంటే, మరోవైపు ఫిష్‌బ్యాక్ వంటి నేతలు ఆ విధానాలను అమెరికన్ కార్మికుల దోపిడిగా అభివర్ణిస్తున్నారు.తాజగా మొదలైన ఈ వివాదం భారత-అమెరికా టెక్ సంబంధాలతో పాటుగా ఇమ్మిగ్రేషన్ పాలసీల భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications