H-1B వీసా ఫీజు పెంపు.. పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్న భారతీయులు, కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబాలు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు H-1B వీసా ఫీజు 1,00,000 డాలర్లకు పెంచిందని ప్రకటించిన తర్వాత.. భారతీయ వీసా హోల్డర్లలో పెద్ద గందరగోళమే ఏర్పడింది. దీపావళి, సంవత్సరం ముగింపు సెలవుల సీజన్ కొద్దిరోజుల ముందు వచ్చిన ఈ ప్రకటన..ఆయా కుటుంబాల ప్రణాళికలపై తీవ్ర ప్రభావమే చూపింది చాలా మంది చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు రద్దు చేసుకున్నారు; కొందరు తమ సొంత వివాహ పర్యటనలను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ట్రంప్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త నియమాలు కొత్త వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటికే హోల్డర్‌గా ఉన్నవారు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే సమాచార లోపం, ఆఫీసియల్ స్పష్టత లేకపోవడం వల్ల భారతీయ H-1B హోల్డర్లు విదేశాలలో చిక్కుకుపోతారా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఏం చేయాలో తెలియక చివరి నిమిషంలో విమానా ప్రయాణాలను రద్దు చేసుకున్నామని పలువురు జాతీయ మీడియాతో తెలిపారు.

ప్రకటనకు ముందు. చాలా మంది దీపావళి కోసం భారతదేశానికి వెళ్లే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. డిసెంబర్ సెలవుల్లో కుటుంబంతో కలిసి ఉండాలని సౌకర్యంగా టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సంవత్సరం ప్రయాణం చేయలాంటే అందరికి 'ఓ మై గాడ్' అనిపిస్తోందని పలువురు వాపోతున్నారు. ఈ చర్యను కొందరు ప్రయాణ నిషేధంగా పేర్కొన్నారు.
H-1B వీసా చెల్లుబాటు అయినప్పటికీ, సరైన ఫీజు రుజువులు లేకపోతే అమెరికా ప్రవేశం సాధ్యం కాదు. పూర్తి విధానం ఏమిటి అనే అంశాల్లో స్పష్టత లేకపోవడం భయాందోళనను మరింతగా పెంచింది. కొన్ని ప్రధాన టెక్ కంపెనీలు కూడా అంతర్గత మెమోలో ముందే దేశం విడిచి వెళ్లవద్దు, ఇప్పటికే అమెరికా వెలుపల ఉన్నవారు తిరిగి రాకూడదని ఉద్యోగులను హెచ్చరించాయి.
H-1B హోల్డర్లు మాత్రమే కాకుండా.. H4 వీసా ఉన్న వారి కుటుంబాలు, F-1 విద్యార్థులు, L-1 వర్క్ వీసా హోల్డర్లపై ఫీజు పెంపు ప్రభావితం ఎంత వరకు అవుతుందో స్పష్టత లేకపోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది. ఏదేమైనా ట్రంప్ అకస్మిక ప్రకటన దీపావళి, సంవత్సరాంతపు సెలవుల సమయంలో భారతీయ వీసా హోల్డర్ల జీవితంలో పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. వివాహాల వంటి విషయాల్లో వందలాది మంది కుటుంబాలు తమ ప్లాన్లు మార్చుకున్నారు. H-1B ఫీజు పెంపు, ప్రస్తుత హోల్డర్లపై తక్షణ ప్రభావం లేకపోయినా.. భవిష్యత్తులో ఎలాంటి నియమాలు వస్తాయో తెలియకపోవడమే ఇలాంటి భయాందోళనలకు కారణమవుతుంది.
ఇక అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఐటీ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రాకుండా ఆపాలి. కేవలం అత్యుత్తమ, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాకు రావాలి. శిక్షణ ఇవ్వాలంటే, మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులను మాత్రమే ఎంచుకోండి అంటూ Howard Lutnick కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపతున్నాయి. నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి.


Click it and Unblock the Notifications