GST మార్పులతో ధరలు తగ్గే వస్తువులు, పెరిగే వస్తువులు ఇవే.. సామాన్యులకు భారం ఎక్కడ పడుతుందంటే..
స్వాతంత్ర్య దినోత్సవం 2025 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ GST రేట్లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. దీపావళి కల్లా దేశంలోని ప్రస్తుత వస్తువులు, సేవల పన్ను విధానాన్ని (GST) పూర్తిగా పునరుద్ధరించి, కొత్త GST చట్టం, సరళమైన రేట్ల విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రకటన ప్రకారం.. త్వరలోనే కొత్త GST స్లాబ్ వ్యవస్థ అమల్లోకి రాబోతోంది.
ఈ మార్పులు ఒకవైపు సామాన్యుడికి ఉపశమనం కలిగించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశకంగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసర వస్తువులపై పన్నును తగ్గించనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్ లో పేర్కొన్నట్లుగా రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను నుంచి మినహాయింపు లభించేందుకు కేంద్రం రెడీ అయింది.అలాగే ఇప్పుడు GST రేటుల గణనీయమైన తగ్గుదలతో కలసి వస్తే సామాన్య పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి మరింత తగ్గనుంది.
కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు అమల్లోకి వస్తే సామాన్యులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కిరాణా సామాగ్రి, రోజువారీ వినియోగ వస్తువులు, సైకిళ్లు, విద్య సంబంధిత వస్తువులపై GST రేటు 12% నుండి 5% కి తగ్గుతుంది.అలాగే టీవీ, ఫ్రిజ్, ఎయిర్ కండిషనర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై GST రేటు 28 శాతం నుండి 18 శాతానికి దిగివచ్చే అవకాశం ఉంది.ఇది కస్టమర్లకు సానుకూల ప్రభావాన్ని చూపించవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే విలాసవంతమైన వస్తువులపై మాత్రం పన్ను భారాన్ని కొంతవరకు పెంచనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిగరేట్లు, గుట్కా లాంటి హానికరమైన వస్తువులకు 40 శాతం వరకు GST వర్తింపజేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ చర్యలను వ్యాపార వృద్ధికి ఒక కీలక దశగా పేర్కొంటున్నాయి.
జెఫరీస్ విశ్లేషణ ప్రకారం.. సిమెంట్, ద్విచక్ర వాహనాలు, మరియు ACపై GST 28 శాతం నుండి 18 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే బీమా, హైబ్రిడ్ కారులు, ప్రాసెస్డ్ ఫుడ్, దుస్తులు, పాదరక్షలు తదితర విభాగాల్లో కూడా తగ్గింపు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక సిటీ సూచనల ప్రకారం.. ఔషధాలు, ప్రాసెస్డ్ ఫుడ్, వైట్ గూడ్స్, బీమా, సిమెంట్ ప్రధాన లబ్ధిదారులుగా ఉండబోతున్నారు. FY26లో వస్తున్న GST రేటు రిఫార్మ్, ఆదాయపు పన్ను తగ్గింపుల ద్వారా GDPలో 0.7 నుండి 0.8 శాతం వరకు స్థానిక ఉద్దీపన వచ్చే అవకాశం ఉందని తెలిపింది. పండగ సీజన్ డిమాండ్, FY27 ఆదాయాల అంచనాలకు బలమిచ్చే ప్రోత్సాహక చర్యగా అభివర్ణించింది.
చౌక అయ్యే వస్తువులు (GST తగ్గేవి)
కిరాణా సరుకులు (డైలీ నిత్యావసరాలు)
సైకిళ్లు & విద్యా సంబంధిత వస్తువులు
ప్రాథమిక విద్య / స్టడీ మెటీరియల్
టీవీ, ఫ్రిజ్, AC (నార్మల్ సెగ్మెంట్)
ప్రాసెస్డ్ ఫుడ్ / FMCG ఉత్పత్తులు
సిమెంట్, బీమా పాలసీలు
ద్విచక్ర వాహనాలు (నార్మల్ సెగ్మెంట్)
వైట్ గూడ్స్ - ఫ్రిడ్జ్ / AC (18%కి తగ్గే వస్తువులు)
ఖరీదయ్యే వస్తువులు (GST పెరిగేవి)
సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా
విలాసవంతమైన జ్యువెలరీ (Gold/Diamond)
ప్రీమియం వాచ్‌లు, హైఎండ్ పర్స్ & హ్యాండ్‌బ్యాగ్స్
లగ్జరీ హోమ్ థియేటర్‌లు, మసాజ్ చైర్స్
హై ఎండ్ స్పోర్ట్స్ కార్లు / లగ్జరీ కార్లు
హై-ఎండ్ రెస్టారెంట్ & 5-స్టార్ హోటల్ సేవలు
ఆల్కహాలిక్ బేవరేజెస్ (పరిశీలనలో)
విలాసవంతమైన గాడ్జెట్స్ (ప్రీమియం coffee machines మొదలైనవి)
గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయం ప్రకారం.. 12 శాతం స్లాబ్‌లో ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యతతో పెద్ద ప్రయోజనం కలగనుందని తెలిపింది. ట్రెంట్, పేజ్, బాటా, మెట్రో బ్రాండ్స్ వంటి రీటైల్ కంపెనీలకు ప్రత్యేక లాభాలు వచ్చే అవకాశం ఉందని పేర్కోంది.CLSA అభిప్రాయం ప్రకారం.. సిమెంట్, AC విభాగాల్లో పన్ను తగ్గింపు డిమాండ్‌ను తిరిగి బలపరచే పెద్ద ట్రిగ్గర్ అవుతుంది. ప్రస్తుతం మందగతిలో ఉన్న AC మార్కెట్ తిరిగి వృద్ధి బాట పట్టే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం భారత్‌లో నాలుగు పెద్ద GST స్లాబ్‌లు ఉన్నాయి:
5% అత్యవసర వస్తువులు, కొన్ని ఫార్మా & కిరాణా ఉత్పత్తులు
12% సాధారణ వినియోగ వస్తువులు, బేసిక్ సేవలు
18% ఎక్కువగా వినియోగించబడే ఉత్పత్తులు, హోమ్ అప్లయన్స్, ప్రాసెస్డ్ ఫుడ్
28% విలాసవంతమైన వస్తువులు, పెద్ద ఎలక్ట్రానిక్స్, కార్లు, సిగరెట్లు మొదలైనవి
అయితే కొత్త పథకం కింద ఈ నాలుగు స్లాబ్‌ల సంఖ్యను మూడు లేదా రెండు వరకే తగ్గించి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ తీర్చిదిద్దడం ప్రభుత్వ ధ్యేయంగా ఉంది.
కొత్త GST స్లాబ్ సంస్కరణలు ఒకవైపు సాధారణ వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించగా, మరోవైపు ఎంపిక చేసిన విలాస వర్గాలపై పన్ను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా వినియోగానికి శక్తి చేకూరడం, మార్కెట్ డిమాండ్ పునరుజ్జీవనంతో పాటుగా FY27 వరకు ఆర్థిక వృద్ధికి స్థిరమైన బలం చేరవచ్చని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications